హీరోయిన్ పై దాడి కేసు.. పోలీసుల ఎదుట విచారణకు హజరైన స్టార్ హీరో
Malayalam Superstar Dileep being interrogated at Crime Branch office.2017లో నటిపై జరిగిన లైంగిక వేధింపుల
By తోట వంశీ కుమార్ Published on 23 Jan 2022 7:21 AM GMT2017లో నటిపై జరిగిన లైంగిక వేధింపుల కేసును విచారిస్తున్న అధికారులను బెదిరించినందుకు తనతో పాటు మరో ఐదుగురిపై నమోదైన కేసులో విచారణ కోసం మలయాళ హీరో దిలీప్ ఆదివారం క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి చేరుకున్నారు. క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి చేరుకున్న హీరో దిలీప్ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఇతర నిందితులు కూడా విచారణ నిమిత్తం దర్యాప్తు సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు. కాగా.. ఈ కేసులో అరెస్టు నుంచి దిలీప్‌కు కేరళ హైకోర్టు తాత్కాలిక రక్షణ కల్పిస్తూ శనివారం ఉత్తర్వులు ఇచ్చింది. మూడు రోజులు (జనవరి 23,24,25 తేదీల్లో) ఉదయం 9 నుంచి రాత్రి 8గంటల వరకు విచారణకు అందుబాటులో ఉండాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో దిలీప్ ఈ రోజు విచారణకు హాజరయ్యారు. విచారణ మరియు మెటీరియల్ సాక్ష్యాధారాలపై నివేదికను జనవరి 27న మళ్లీ విచారించనున్న నేపథ్యంలో సీల్డ్ కవర్‌లో సమర్పించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను కోర్టు ఆదేశించింది.
ఏం జరిగిందంటే..?
మలయాళం, తమిళ బాషల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఓ ప్రముఖ నటి 2017 ఫిబ్రవరి 17న కేరళలో సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని కారులో బయలుదేరింది. మార్గం మద్యలో కారులో వెలుతున్న ఆ నటిని కిడ్నాప్ చేసిన కొందరు నిందితులు ఆమె మీద లైంగిక దాడి చేసి వీడియోలు తీశారని నటి ఫిర్యాదు చెయ్యడంతో కేరళ పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మలయాళ చిత్ర పరిశ్రమలో టాప్ 5 హీరోల్లో ఒకరైన హీరో దిలీప్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
రెండు నెలల పాటు జైలులో ఉన్న దిలీప్.. అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చి కోర్టు విచారణకు హాజరవుతున్నారు. అయితే.. ఈ కేసు విచారణ చేస్తున్న కొందరు పోలీసు అధికారులను బెదిరించేందుకు దిలీప్ కుట్ర పన్నాడనే ఆరోపణలు వచ్చాయి. ఓ టీవీ ఛానెల్ ఇందుకు సంబంధించిన కొన్ని ఆడియో క్లిప్‌లను ప్రసారం చేసింది. దీంతో అప్రమత్తమైన దర్యాప్తు అధికారులు టీవీ ఛానెల్ ప్రసారం చేసిన క్లిప్ ఆధారంగా దిలీప్‌తో పాటు అతడి సోదరుడు పి.శివకుమార్ అలియాస్ అనూప్, దిలీప్ బావ టీఎన్. సూరజ్, బంధువు అప్పు, స్నేహితుడు బైజూ చెయంగనాడ్, హోటల్ యజమాని శరత్ పై కేసు నమోదు చేశారు.
అయితే.. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ దిలీప్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కాగా..హీరో దిలీప్ కు బెయిల్ ఇవ్వకూడదని కేరళ పోలీసులు 68 పేజీల అఫిడవిట్ దాఖలు చేశారు. వాదనలు విన్న కేరళ హైకోర్టు.. అరెస్టు నుంచి దిలీప్‌కు తాత్కాలిక రక్షణ కల్పిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది అదే సమయంలో పోలీసుల ఎదుట మూడు రోజుల పాటు విచారణకు హాజరుకావాలని దిలీప్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే దిలీప్ ఈ రోజు విచారణకు హాజరయ్యారు. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది.