సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు ప్రతాప్ పోతన్ కన్నుమూశారు. చెన్నైలోని ఆయన నివాసంలో గురువారం అర్థరాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 70 సంవత్సరాలు. ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురైయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
1952లో వ్యాపార కుటుంబంలో జన్మించిన ఆయనకు సినీ రంగంపై ఆసక్తి ఎక్కువ. 'ఆరవం' అనే మలయాళ చిత్రంతో తెరగ్రేటం చేశారు. తెలుగు, తమిళ, మలయాళం బాషల్లో వందకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. 'మరో చరిత్ర', 'ఆకలిరాజ్యం', 'డబ్బు డబ్బు డబ్బు', 'అమాయకుడు కాదు అసాధ్యుడు', 'కాంచనగంగ' సినిమాల్లో నటించి ఆయన తెలుగు ప్రేక్షకులకు చేరువ అయ్యారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా ఆయన డజన్‌కు పైగా చిత్రాలను తెరకెక్కించారు. తెలుగులో నాగార్జున నటించిన 'చైతన్య' సినిమాకి దర్శకత్వం వహించారు.
1985లో ప్రముఖ నటి రాధికను వివాహం చేసుకున్నారు ప్రతాప్ పోతన్. అయితే వారి బంధం ఎంతో కాలం కొనసాగలేదు. 1986లో రాధికకు విడాకులు ఇచ్చారాయన. ఇటీవల విడుదలైన మలయాళ చిత్రం 'సిబిఐ 5' లో ప్రతాప్ పోతన్ చివరిసారిగా తెరపై కనిపించారు.