సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. మలయాళ నటి, సహాయ దర్శకురాలు అంబికారావు గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె వయస్సు 58 సంవత్సరాలు. కరోనా బారిన పడిన అనంతరం వచ్చిన సమస్యలతో ఎర్రాకులంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుండగా సోమవారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
అంబికారావు.. 2002లో బాలచంద్ర మీనన్ దర్శకత్వంలో విడుదలైన 'కృష్ణ గోపాలకృష్ణ' చిత్రంతో సహాయ దర్శకురాలిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. దాదాపు రెండు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. ఆమె కెరీర్‌లో మమ్ముట్టి నటించిన 'రాజమాణిక్యం', 'తొమ్మనుమ్ మక్కలుమ్', పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన 'వెళ్లినక్షత్రం' చిత్రాలకు సహాయ దర్శకురాలిగా పనిచేశారు.
సహాయ దర్శకురాలిగా పనిచేయడంతో పాటు నటిగానూ వెండితెరపై మెప్పించారు. 'మీషా మాధవన్', 'సాల్ట్ అండ్ పెప్పర్', ఇటీవల విడుదలైన 'అనురాగ కరికిన్ వెల్లం', 'థమాషా', 'వెల్లం' వంటి అనేక సినిమాలలో కూడా నటించింది.
ఇక ఆమెకు ఇద్దరు సంతానం. వారి పేర్లు రాహుల్, సోహన్. కాగా..ఆమెపై మరణంపై మలయాళ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. అంబికారావు అకాల మృతికి మలయాళ సినీ తారలు, సాంకేతిక నిపుణులు సంతాపం తెలిపారు.'శాంతితో విశ్రాంతి తీసుకోండి అంబికా చెచీ' అని పృథ్వీరాజ్ సుకుమారన్ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.