అభిమానుల‌కు మ‌హేష్ బాబు విజ్ఞ‌ప్తి.. పుట్టిన రోజు నాడు ఆ ప‌ని చేయండి

Mahesh Babu makes special appeal to fans for his birthday.టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Aug 2021 7:36 AM GMT
అభిమానుల‌కు మ‌హేష్ బాబు విజ్ఞ‌ప్తి.. పుట్టిన రోజు నాడు ఆ ప‌ని చేయండి

టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ ఇంకెవ్వ‌రికీ ఉండ‌దు. ఆయ‌నంటే ఇష్ట‌ప‌డ‌ని వారంటూ ఎవ్వ‌రూ ఉండ‌రు. ఇటు సాధార‌ణ ప్రేక్ష‌కుల‌తో పాటు లేడీస్ ఫాలోయింగ్ విష‌యంలో మ‌హేష్‌కు స‌రిలేరు నీకెవ్వ‌రు అనాల్సిందే. ఇక అభిమానులంతా ఆయ‌న్ను ముద్దుగా ప్రిన్స్ అని పిలుచుకుంటారు. సూప‌ర్ స్టార్ కృష్ణ వార‌సుడిగా తెర‌గ్రేటం చేసినా.. త‌న‌కంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్నారు మ‌హేష్‌.

ఇదిలా ఉంటే.. ఆగ‌స్టు 9న మ‌హేష్ బాబు 46వ ప‌డిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సంద‌ర్భంగా ఫ్యాన్స్ మ‌హేష్ బ‌ర్త్ డే వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌హేష్ బాబు త‌న అభిమానుల‌కు సోష‌ల్ మీడియా ద్వారా ఓ విజ్ఞ‌ప్తి చేశారు. తన పుట్టిన రోజు కానుకగా.. ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని మహేష్ అభిమానులకు పిలుపునిచ్చారు.

'నామీద ఉన్న ప్రేమతో మీరు చేసే పనులన్ని నన్ను ఇంకా ప్రేరేపిస్తున్నాయి. ఈ సంవత్సరం నేను ప్రత్యేకంగా కొరుకుంటున్నాను. #GreenIndiaChallengeకి మద్ధతుగా నా పుట్టిన రోజు నాడు ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని అందరిని కోరుతున్నాను. మొక్కలు నాటే ఫోటోలను షేర్ చేస్తూ నన్ను ట్యాగ్ చేయండి.. అప్పుడే నేను చూడగలను' అంటూ పోస్టు చేశారు.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. మ‌హేష్ ప్ర‌స్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' చిత్రంలో న‌టిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న‌ కిర్తీ సురేష్ న‌టిస్తోంది. కాగా.. మ‌హేష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్రం నుంచి బ్లాక్ బాస్ట‌ర్ అప్‌డేట్ ఇవ్వ‌నున్న‌ట్లు చిత్ర బృందం ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. దీంతో అభిమానులంతా ఎంతో ఆతృత‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది.

Next Story
Share it