'మహాభారతం' టీవీ షోలో శ్రీకృష్ణుడి పాత్రలో దేశం మొత్తాన్ని అలరించిన నటుడు నితీష్ భరద్వాజ్ తన మాజీ భార్య, మధ్యప్రదేశ్ కేడర్ ఐఏఎస్ స్మితా భరద్వాజ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్మిత చాలా కాలంగా తనను మానసికంగా వేధిస్తూ ఉందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నితీష్ భరద్వాజ్ భోపాల్ పోలీస్ కమిషనర్ హరినారాయణచారి మిశ్రాకు తనకు సహాయం చేయాలని కోరుతూ లేఖ రాశారు. తన మాజీ భార్య తనను మానసికంగా వేధించడమే కాకుండా తన కుమార్తెలను కలవడానికి కూడా అనుమతించడం లేదని ఆయన వాపోయారు. నితీష్ భరద్వాజ్ ఫిర్యాదు మేరకు భోపాల్ పోలీస్ కమిషనర్ దీనిపై విచారణకు ఆదేశించారు. విచారణ బాధ్యతను అదనపు డీసీపీ షాలినీ దీక్షిత్‌కు అప్పగించారు.
ఇదే విషయాన్ని భోపాల్ పోలీస్ కమిషనర్ హరినారాయణాచారి మిశ్రా ధృవీకరించారు. నితీష్ భరద్వాజ్ నుంచి ఫిర్యాదు అందిందని, దీనిపై విచారణ జరిపి నిజానిజాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ప్రముఖ టీవీ షో 'మహాభారతం'లో నితీష్ భరద్వాజ్ శ్రీకృష్ణుడి పాత్రను పోషించారు. నితీష్ భరద్వాజ్ మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన IAS అధికారిణి అయిన స్మితను మార్చి 14, 2009న వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 11 సంవత్సరాల వయస్సు ఉన్న కవల కుమార్తెలు ఉన్నారు. 12 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత.. నితీష్, స్మిత 2019లో విడిపోయారు. వారికి విడాకులు 2022లో ఇచ్చారు.