సినీ నటి జయప్రదకు మద్రాస్ హైకోర్టు షాక్.. లొంగిపోవాలని ఆదేశం
మద్రాస్ హైకోర్టులో సినీ నటి జయప్రదకు చుక్కెదురైంది.
By Srikanth Gundamalla
సినీ నటి జయప్రదకు మద్రాస్ హైకోర్టు షాక్.. లొంగిపోవాలని ఆదేశం
ఉద్యోగులకు ఈఎస్ఐ చెల్లింపుల్లో అవకతవకల కేసులో సినీ నటి జయప్రద ఉన్నారు. అయితే.. ఈ కేసులో తనకు విధించిన జైలు శిక్షను రద్దు చేయాలంటూ జయప్రద మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా జయప్రదకు చుక్కెదురైంది. 15 రోజుల్లోగా కోర్టులో లొంగిపోవాలని.. అలాగే రూ.20 లక్షలు కూడా డిపాజిట్ చేయాలని మంద్రాస్ హైకోర్టులో శుక్రవారం తీర్పును వెలువరించింది. దాంతో.. సినీనటి జయప్రద చిక్కుల్లో పడినట్లు అయ్యింది.
జయప్రద చెన్నైకి చెందిన రామ్‌కుమార్, రాజ్‌బాబులతో కలిసి అన్నాసాలైలో ఓ సినిమా థియేటర్ నడిపారు. అందులో సిబ్బందికి ఈఎస్‌ఐ చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఎగ్మూర్ కోర్టులో కేసు దాఖలైంది. విచారించిన కోర్టు జయప్రద సహా ముగ్గురికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా చొప్పున విధిస్తూ ఆగస్టులో తీర్పునిచ్చింది. దీనిపై ఆమె మద్రాసు హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ పిటిషన్‌ను కిందటిసారి విచారించిన న్యాయమూర్తి ఈఎస్‌ఐకి చెల్లించాల్సిన రూ.37.68 లక్షలు చెల్లించడం కుదురుతుందా? లేదా అనే విషయంపై జయప్రద వివరణ ఇవ్వాలని ఆదేశించారు. రూ. 20 లక్షలు చెల్లిస్తామని జయప్రద కోర్టుకు వెల్లడించారు. దీనిని ఈఎస్‌ఐ తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. అనంతరం ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి శుక్రవారం తీర్పు ఇచ్చారు. జయప్రద తదితరులు దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టేశారు.