మద్రాస్‌ హైకోర్టులో విశాల్‌కు చుక్కెదురు.. 3 వారాల్లో రూ.15 కోట్లను..

Madras High Court orders Vishal to pay Rs.15 crore as a fixed deposit. తమిళ నటుడు విశాల్ న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. మద్రాస్ హైకోర్టు రూ. 15 కోట్ల మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలో

By అంజి  Published on  13 March 2022 12:06 PM IST
మద్రాస్‌ హైకోర్టులో విశాల్‌కు చుక్కెదురు.. 3 వారాల్లో రూ.15 కోట్లను..

తమిళ నటుడు విశాల్ న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. మద్రాస్ హైకోర్టు రూ. 15 కోట్ల మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలో జమ చేయాలని విశాల్‌కు ఆదేశాలు జారీ చేసింది. విశాల్‌ రోబో '2.0' సినిమా ఫేమ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ నుండి తీసుకున్న రుణానికి సంబంధించి రూ.15 కోట్లు మూడు వారాల్లోగా కోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ పేరిట డిపాజిట్‌ చేయాలని పేర్కొంది. ఇటీవల 'సామాన్యుడు' సినిమాలో కనిపించిన విశాల్, లైకాకు వడ్డీతో కలిపి రూ. 21.69 కోట్లు చెల్లించాల్సి ఉంది. 'వీరమే వాగై సుడుం' సినిమా శాటిలైట్‌, ఓటీటీ హక్కులు విక్రయించేందుకు విశాల్‌ రెడీ అయ్యారని లైకా ప్రొడక్షన్‌ ఆరోపించింది.

తమ దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వకుండా, కొత్త సినిమా విడుదల చేసేందుకు విశాల్‌ సిద్ధం అవుతున్నారని లైకా సంస్థ ఆరోపణలు చేసింది. విశాల్‌ నుండి వడ్డీతో సహా రూ.21.69 కోట్ల రుణాన్ని రికవరీ చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలంటూ లైకా సంస్థ పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ సెంథిల్‌ కుమార్‌ రామమూర్తి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే రూ.15 కోట్లు కోర్టు పేరిట బ్యాంకులో డిపాజిట్‌ చేయాలని విశాల్‌ను ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.

విశాల్ తన 'మరుదు' సినిమా కోసం గోపురం ఫిల్మ్స్ (అన్బు చెలియన్) నుండి 21 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నాడు. అతను సకాలంలో మొత్తాన్ని తిరిగి చెల్లించలేనందున, విశాల్ ఆ మొత్తాన్ని చెల్లించమని లైకా ప్రొడక్షన్స్‌ని కోరాడు మరియు డిసెంబర్ 2020 నాటికి చెల్లిస్తానని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చాడు. దాని ప్రకారం.. అతని రుణాన్ని లైకా ప్రొడక్షన్స్ సెటిల్ చేసింది. అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా విశాల్ ఆ వాయిదాకు మించి రుణాన్ని చెల్లించలేదు. దాంతో లైకా ప్రొడక్షన్స్ అతనికి నోటీసు పంపింది. దానికి ఆయన స్పందించకపోవడంతో ప్రొడక్షన్ హౌస్ తరపున మద్రాసు హైకోర్టులో కేసు వేశారు. ఇంతకు ముందు ఆగస్టు 2021లో, విశాల్‌పై ఎటువంటి అర్హత లేని దరఖాస్తును దాఖలు చేసినందుకు లైకా ప్రొడక్షన్స్‌పై మద్రాస్ హైకోర్టు రూ. 5 లక్షల జరిమానా విధించడం గమనార్హం.

Next Story