బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై ముంబై పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. పెట్టుబడి పేరుతో ఓ వ్యాపారికి రూ.60 కోట్ల మేర మోసం చేశారనేది కేసు. బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ కోసం శిల్పా, రాజ్‌లు తమ వ్యాపార విస్తరణ పేరుతో తన నుంచి రూ.60 కోట్లు తీసుకున్నారని వ్యాపారవేత్త దీపక్ కొఠారి ఆరోపిస్తున్నారు. ఈ మొత్తాన్ని ఇద్దరూ తమ వ్యక్తిగత ఖర్చులకే ఖర్చు చేశారని కొఠారీ తెలిపారు. మొదట్లో ఈ మొత్తాన్ని రుణంగా తీసుకుంటున్నట్లు చెప్పగా, ఆ తర్వాత పన్ను ఆదా చేసేందుకు పెట్టుబడిగా చూపించారు.. ఈ మొత్తానికి 12 శాతం వార్షిక వడ్డీ ఇస్తామని హామీ కూడా ఇచ్చారని కొఠారీ తెలిపారు. ఈ హామీని స్వయంగా శిల్పాశెట్టి తనకు లిఖితపూర్వకంగా ఇచ్చారని, అయితే ఆ తర్వాత శిల్పా సంస్థ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారని దీపక్ కొఠారి తెలిపారు. కంపెనీపై రూ.1.28 కోట్ల దివాలా కేసు కూడా పెండింగ్‌లో ఉందని చాలా కాలం తర్వాత తెలిసిందని కొఠారీ చెప్పారు. అయితే, ఈ ఆరోపణలన్నింటినీ శిల్పా, రాజ్‌లు కొట్టిపారేశారు. తమ పరువు తీసే లక్ష్యంతో చేసిన ఆరోపణలని వారు పేర్కొన్నారు. శిల్పా, రాజ్‌ల ప్రయాణ రికార్డులను కూడా ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు చేస్తోంది. కాగా, కంపెనీ ఆడిటర్‌ను కూడా విచారణకు పిలిచారు.