లెజెండ్రీ పాకిస్థానీ నటుడు జియా మొహెద్దీన్ కన్నుమూత
Legendry Pakistani actor Zia Mohyeddin passes away. ఇస్లామాబాద్ : హాలీవుడ్‌లో పనిచేసిన తొలి పాకిస్థానీ జియా మొహెద్దీన్ సోమవారం అనారోగ్యంతో
By అంజి Published on 13 Feb 2023 5:27 PM ISTఇస్లామాబాద్ : హాలీవుడ్‌లో పనిచేసిన తొలి పాకిస్థానీ జియా మొహెద్దీన్ సోమవారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 91. ప్రముఖ నటుడు, దర్శకుడు, టీవీ హోస్ట్ అయిన జియా మొహెద్దీన్ కడుపు నొప్పి, జ్వరంతో బాధపడుతూ కరాచీలోని ఆసుపత్రిలో చేరారు. కొన్ని శస్త్ర చికిత్సల అనంతరం అతడిని లైఫ్ సపోర్టుపై తరలించారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 6.30 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. కరాచీలోని డిఫెన్స్ ఏరియాలో అంత్యక్రియల ప్రార్థనలు నిర్వహించనున్నారు.
మొహెద్దీన్ జూన్ 20, 1931న పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని ఫైసలాబాద్‌లో జన్మించాడు. నటన, బ్రాడ్‌కాస్టింగ్, కవితా పఠనంలో మంచి పేరును సంపాదించుకున్నాడు. అతను కరాచీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌కు ఎమెరిటస్ ప్రెసిడెంట్‌గా కూడా ఉన్నాడు. ఎంతో మంది వర్ధమాన కళాకారులకు శిక్షణ ఇచ్చారు. వివిధ వార్తాపత్రికలకు కాలమ్స్ కూడా రాశారు. మొహెద్దీన్ తన కెరీర్ మొత్తంలో బ్రిటిష్ సినిమా, టెలివిజన్‌తో పాటు పాకిస్తాన్ సినిమా, టెలివిజన్ లోనూ కనిపించాడు.
అతని చిరస్మరణీయమైన ప్రదర్శనలలో దర్శకుడు డేవిడ్ లీన్ రూపొందించిన లారెన్స్ ఆఫ్ అరేబియా' (1962), దర్శకుడు ఫ్రెడ్ జిన్నెమాన్ చేసిన బిహోల్డ్ ది పేల్ హార్సైన్ (1964), దర్శకుడు జమీల్ డెహ్లావిచే ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్ (1992) ఉన్నాయి. ప్రముఖ నటుడికి 2012లో కళ రంగానికి చేసిన కృషికి గాను పాకిస్తాన్‌లో రెండవ అత్యున్నత పౌర పురస్కారం హిలాల్-ఎ-ఇమ్తియాజ్ లభించింది. అతను ఎ క్యారెట్ ఈజ్ ఎ క్యారెట్', థియేట్రిక్స్', ది గాడ్ ఆఫ్ మై ఐడొలటరీ మెమోరీస్ అండ్ రిఫ్లెక్షన్స్' అనే మూడు పుస్తకాలను కూడా రచించాడు.
ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ దిగ్గజ ప్రదర్శనకారుడి మరణం పట్ల తన విచారం, సంతాపం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా సంతాపం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.