తీవ్ర విషాదం..లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత
భారతీయ సంగీత శిఖరం ఆశా భోంస్లే ఇక లేరు
By - Knakam Karthik |
తీవ్ర విషాదం..లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత
భారతీయ సంగీత శిఖరం ఆశా భోంస్లే ఇక లేరు. గత శనివారం తీవ్ర నీరసం, ఛాతీ ఇన్ఫెక్షన్‌తో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరిన ఆమె, చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఐసీయూలో వైద్యులు చేసిన పోరాటం ఫలించలేదని ఆమె కుమారుడు ఆనంద్, మనవరాలు జానై ధృవీకరించారు. సోమవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆమె నివాసంలో అభిమానుల సందర్శనార్థం పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు శివాజీ పార్కులో అంత్యక్రియలు జరుగుతాయి.
లెజెండరీ గాయని లతా మంగేష్కర్ సోదరి అయిన ఆశా, 1933 సెప్టెంబర్ 8న సాంగ్లీలో జన్మించారు. 1943లో ప్రారంభమైన ఆమె సంగీత ప్రస్థానం ఎనిమిది దశాబ్దాల పాటు అప్రతిహతంగా సాగింది. 20కి పైగా భాషల్లో 12,000కు పైగా గీతాలను ఆలపించి, 2011లో గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. తెలుగుతో సహా అనేక భాషల్లో తన అద్వితీయ స్వరంతో శ్రోతలను అలరించిన ఆమె మరణం భారతీయ కళారంగానికి తీరని లోటు.