టాలీవుడ్‌లో విషాదం.. రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత
Legendary Actor Krishnam Raju Dies at 83.సీనియర్ నటుడు, రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నుమూశారు.
By తోట వంశీ కుమార్ Published on 11 Sept 2022 7:35 AM ISTతెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు, రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున పరిస్థితి విషమించడంతో 3.25 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు.
కష్ణం రాజు పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో 1940 జనవరి 20న జన్మించారు. చదువు పూర్తి కాగానే జర్నలిస్టుగా పని చేశారు. అనంతరం సినీ రంగంలో అడుగుపెట్టారు.1966లో వచ్చిన 'చిలకా గోరింక' సినిమాతో హీరోగా అరంగ్రేటం చేవారు. 'అవే కళ్లు' అనే చిత్రంలో విలన్‌గానూ నటించారు. ఐదున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో సుమారు 180కి పైగా చిత్రాల్లో నటించారు. 'బుద్దిమంతుడు', 'మనుషులు మారాలి', 'పెళ్లి కూతురు', 'మహమ్మద్ బిన్ తుగ్గక్', 'హంతకులు దేవాంతకులు', 'నీతి నియమాలు', 'తల్లీకొడుకులు', 'భక్త కన్నప్ప', 'తాండ్ర పాపారాయుడు', 'బొబ్బొలి బ్రహ్మన్న', 'రారాజు', 'త్రిశూలం', 'రంగూన్ రౌడీ', 'మన ఊరి పాండవులు', 'కటకటాల రుద్రయ్య', 'సతీ సావిత్రి', 'పల్నాటి పౌరుషం' వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మదిలో చెదరని ముద్ర వేశారు. కృష్ణం రాజు చేసిన పాత్రలే ఆయనకి "రెబల్ స్టార్" అనే పేరు తీసుకొచ్చాయి.
1977, 1984లో నంది అవార్డులు గెలుచుకున్నారు. 1986లో 'తాండ్ర పాపారాయుడు' చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. 2006లో ఫిల్మ్‌ఫేర్ దక్షిణాది జీవిత సాఫల్య పురస్కారాన్ని పొందారు.
ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు రాజకీయాల్లోనూ అడుగుపెట్టారు. 1991లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన అదే సంవత్సరం నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటి చేసి ఓటమిపాలైయ్యారు. తరువాత కొంత కాలం రాజకీయాలకు దూరమై సినిమాలకే పరిమితం అయ్యారు. అనంతరం బీజేపీలో చేరిన కృష్ణంరాజు 1999 మధ్యంతర ఎన్నికల్లో నర్సాపురం ఎంపీగా గెలుపొందారు. వాజ్‌పేయి హయాంలో కేంద్రమంత్రిగానూ సేవలందించారు.
ఆయన నట వారసుడిగా తెరగ్రేటం చేసిన ప్రముఖ నటుడు ప్రభాస్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రభాస్ నట ప్రయాణం తనకి అత్యంత సంతృప్తినిచ్చే విషయం అని కృష్ణం రాజు చెబుతుండేవారు.
కృష్ణంరాజు మృతి పట్ల పలువురు రాజకీయ, సీని ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన అంత్యక్రియలు సోమవారం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.