ముదురుతున్న లక్ష్మీదేవి నెక్లెస్‌ వివాదం.. హీరోయిన్‌ తాప్సీపై కేసు బుక్‌

హీరోయిన్‌ తాప్సీ పన్నుపై పోలీసు కేసు నమోదు అయ్యింది. బీజేపీ ఎమ్మెల్యే మాలిని కుమారుడు ఏకలవ్య గౌర్‌.. తాప్సీపై ఛత్రపుర

By అంజి  Published on  29 March 2023 4:21 AM GMT
Lakshmi Devi necklace controversy, Taapsee Pannu

ముదురుతున్న లక్ష్మీదేవి నెక్లెస్‌ వివాదం.. హీరోయిన్‌ తాప్సీపై కేసు బుక్‌

టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌కు చెక్కేసిన హీరోయిన్‌ తాప్సీ పన్నుపై పోలీసు కేసు నమోదు అయ్యింది. ఇండోర్ లోని హింద్ రక్షక్ సంగతన్ కన్వీనర్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యే మాలిని కుమారుడు ఏకలవ్య గౌర్‌.. తాప్సీపై మధ్యప్రదేశ్ లోని ఛత్రపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న తాప్సీ.. ఇటీవల ఓ ఫ్యాషన్‌ షోలో లక్ష్మీదేవీ నెక్లెస్‌ను ధరించి సందడి చేశారు. దీన్ని తప్పుబడుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మతాన్ని కించపరిచేలా తాప్సీ.. ఆ ఫ్యాషన్‌ షోలో వ్యవహరించారని ఏకలవ్య గౌర్‌ పేర్కొన్నారు.

ఈ నెల 12వ తేదీన ముంబై మహా నగరంలో లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో తాప్సీ పాల్గొన్నారు. ఈ షోలో ఆమె శరీరం కనిపించేలా ఎర్రని గౌను ధరించి.. దానికి సూట్‌ అయ్యే ఓ ఖరీదైన బంగారపు నెక్లెస్‌ను మెడలో వేసుకున్నారు. అయితే ఆ నెక్లెస్‌పై లక్ష్మీదేవి డిజైన్‌ ఉండటం వివాదానికి దారి తీసింది. వెస్ట్రన్‌ వేర్‌ దుస్తులు ధరించి లక్ష్మీదేవి నెక్లెస్‌ వేసుకోవడం పట్ల పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ పోజింగ్ చేసే వాళ్ళు దేవతల లాకెట్లు ధరించడం ఏంటని పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.

ఇలా చేయడం సరికాదంటూ పలువురు విమర్శలు చేశారు. ఈ ఈవెంట్‌లో తాప్సీ డ్రెస్సింగ్‌ పట్ల అసహనం వ్యక్తం చేస్తూ.. ఏకంగా ఏకలవ్య గౌర్‌ పోలీసులకే ఫిర్యాదు చేశారు. ఓ మతాన్ని అవమానించేలా తాప్సీ ప్రవర్తించారని, వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. మరీ పోలీసులు ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు వెబ్‌ సిరీస్‌లతో పాటు బాలీవుడ్‌లో రెండు ప్రాజెక్టులు చేస్తోంది.

Next Story