8 ఏళ్ల వయస్సులోనే మా నాన్న లైంగికంగా వేధించాడు: ఖుష్బూ
ఎనిమిదేళ్ల వయసులో తన తండ్రి తనను లైంగికంగా, శారీరకంగా వేధించాడని, చాలా భయపడ్డానని కుష్బూ వెల్లడించారు.
By అంజి
8 ఏళ్ల వయస్సులోనే మా నాన్న లైంగికంగా వేధించాడు: ఖుష్బూ (ఫైల్ ఫొటో)
సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సుందర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఎనిమిదేళ్ల వయసులో తన తండ్రి తనను లైంగికంగా, శారీరకంగా వేధించాడని, చాలా భయపడ్డానని కుష్బూ వెల్లడించారు. తనను తన తండ్రి గాయపరిచి, చిత్రహింసలకు గురిచేశాడని ఆరోపించారు. వుమెన్స్ డే పురస్కరించుకుని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
''పిల్లలు వేధింపులకు గురైనప్పుడు.. అది వారి జీవితంలో ఓ మచ్చగా ఉంటుంది. అది అమ్మాయి లేదా అబ్బాయి అయినా సరే వారిని భయానికి గురి చేస్తుంది. తన భార్యను కొట్టడం, పిల్లలను కొట్టడం, తన ఏకైక కుమార్తెను లైంగికంగా వేధించడం తన జన్మహక్కుగా భావించే వ్యక్తితో నా తల్లి అత్యంత దుర్మార్గమైన వివాహాన్ని ఎదుర్కొంది. వేధింపులు ప్రారంభమైనప్పుడు నాకు కేవలం 8 సంవత్సరాల వయస్సు. నాకు 15 సంవత్సరాల వయస్సులో అతనికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం వచ్చింది.'' అని తెలిపారు.
లైంగిక వేధింపుల విషయాన్ని చెబితే అమ్మ నమ్ముతుందో లేదోనని ఎంతో భయపడ్డానని, ఎందుకంటే ఏం జరిగినా తన భర్త దేవుడని నమ్మే మనస్తత్వం తన తల్లిదని ఖుష్భూ వెల్లడించారు. తనకు 16 ఏళ్లు రాకముందే తన తండ్రి తమను వదిలివెళ్లిపోయాడని, ఆ సమయంలో మేము ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నామని ఖుష్బూ వివరించారు.
ఖుష్బు సుందర్ సినిమా నటి, నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాత కూడా. మొదట డీఎంకేలో చేరిన ఆమె.. ఆ తర్వాత కాంగ్రెస్‌లోకి వెళ్లి పార్టీ అధికార ప్రతినిధి అయ్యారు. ఆమె చివరికి బీజేపీలోకి మారి 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసింది. కానీ డీఎంకే అభ్యర్థి చేతిలో ఓడిపోయింది. ఖుష్బూ ఇటీవలే జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించారు.