కృష్ణ విష‌యంలో వైద్య‌నీతి పాటించాం.. మ‌ర‌ణానికి కార‌ణం ఇదే : కాంటినెంట‌ల్ వైద్యులు

Krishna Dies of multi organ failure Continental hospitals CMD.సూప‌ర్ స్టార్ కృష్ణ మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున క‌న్నుమూసిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Nov 2022 4:53 AM GMT
కృష్ణ విష‌యంలో వైద్య‌నీతి పాటించాం.. మ‌ర‌ణానికి కార‌ణం ఇదే : కాంటినెంట‌ల్ వైద్యులు

సూప‌ర్ స్టార్ కృష్ణ మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మృతిపై కాంటినెంట‌ల్ ఆస్ప‌త్రి వైద్యులు స్పందించారు. గుండెపోటు, మ‌ల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కార‌ణంగానే ఆయ‌న మ‌ర‌ణించిన‌ట్లు చెప్పారు. వైద్య‌నీతి పాటించి ఆయ‌న‌కు ఎలాంటి ఇబ్బంది క‌లుగ‌కుండా మ‌నఃశాంతిగా వెళ్లిపోయేలా చేశామ‌ని కాంటినెంట‌ల్ ఆస్ప‌త్రి చైర్మ‌న్‌, ఎండీ డాక్ట‌ర్ గురు ఎన్‌రెడ్డి మీడియాకు తెలిపారు.

సోమ‌వారం తెల్ల‌వారుజామున కృష్ణ కార్డియాక్ అరెస్ట్‌తో త‌మ ఆస్ప‌త్రిలో చేరార‌ని అన్నారు. అయితే.. ఆయ‌న్ను ఆస్ప‌త్రికి తీసుకువ‌చ్చే స‌మ‌యానికే ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌న్నారు." రెండు, మూడు గంట‌ల త‌రువాత ప‌లు అవ‌య‌వాలు ప‌నిచేయ‌డం మానేశాయి. నాలుగు గంట‌ల త‌రువాత డ‌యాల‌సిస్ చేశాం. సోమ‌వారం సాయంత్రానికి ఆయ‌న ఆరోగ్యం మ‌రింత దిగ‌జారింది. గంకోసారి కృష్ణ ఆరోగ్యంపై కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం ఇస్తూనే ఉన్నాం. ఎలాంటి ట్రీట్‌మెంట్ అందించినా ఫ‌లితం ఉండ‌ద‌ని నిర్థార‌ణ‌కు వ‌చ్చాం. దీంతో ఆయ‌న‌కు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా ఉన్న కొన్ని గంట‌లు మ‌నఃశాంతిగా వెళ్లిపోవాల‌ని కుటుంబ స‌భ్యుల‌తో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకున్నాం. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున 4.09గంట‌ల‌కు తుదిశ్వాస విడిచారు. ఆయ‌న విష‌యంలో వైద్య నీతి పాటించాం. ఆయ‌న కుటుంబానికి బలం చేకూరాల‌ని ప్రార్థిస్తున్నాం. కృష్ణ భౌతిక‌కాయాన్ని వాళ్ల కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించాం" అని డాక్ట‌ర్ గురు మీడియాకు తెలిపారు.

Next Story