క్రాక్ మూవీ రివ్యూ.. బొమ్మ అదిరింది.. ర‌వితేజ లెక్క‌త‌ప్ప‌లేదు

Krack Movie Review.అంద‌రి కంటే ముందుగా ర‌వితేజ క్రాక్ మూవీతో వ‌చ్చేశాడు. ర‌వితేజ లెక్క‌త‌ప్ప‌లేదు, రివ్యూ బాగా వుంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Jan 2021 7:17 AM GMT
krack movie review

నటీనటులు : రవితేజ, శ్రుతిహాసన్, వరలక్ష్మి, సముద్రఖని

దర్శకత్వం: గోపీచంద్ మలినేని

మ్యూజిక్: థమన్

సినిమాటోగ్రఫీ: జీకే విష్ణు

నిర్మాత: ఠాగూర్ మధు

సంక్రాంతికి కొత్త సినిమాల సంద‌డి ఉండి తీరాల్సిందే. ఈ సారి ఏకంగా నాలుగు సినిమాలు సంక్రాంతి బ‌రిలో దిగుతున్నాయి. అంద‌రి కంటే ముందుగా ర‌వితేజ క్రాక్ మూవీతో వ‌చ్చేశాడు. గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇప్ప‌టికే వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో డాన్ శీను, బ‌లుపు వంటి చిత్రాలు వ‌చ్చాయి. చాలా కాలంగా స‌రైన స‌క్సెస్ లేక స‌త‌మ‌త‌మ‌వుతున్న మాస్ మ‌హారాజ్ ఈ చిత్రంతో ట్రాక్‌లోకి వ‌చ్చాడో లేదో చూద్దాం.

క‌థ : పోత‌రాజు వీర‌శంక‌ర్‌(ర‌వితేజ‌) ఓ ప‌వ‌ర్ పుల్ పోలీస్ ఆఫీస‌ర్‌. అతనికో బలహీనత.. బ్యాగ్రౌండ్ అని ఎవడైనా అంటే చాలు చెలరేగిపోయి అవతలి వాళ్లు మక్కెలు విరగతీస్తూంటాడు. వృత్తినీ కుటుంబాన్ని స‌మంగా ప్రేమిస్తుంటాడు. అత‌ని భార్య క‌ల్యాణి(శృతిహాస‌న్‌) ఓ కొడుకుతో క‌లిసి సంతోషంగా జీవిస్తుంటాడు. సీఐగా ఒంగోలుకి వెళ్లాక అక్క‌డి ముఠా నాయ‌కుడు క‌ఠారి కృష్ణ‌(స‌ముద్ర ఖ‌ని)తో వైరం ఏర్ప‌డుతుంది. కటారి కృష్ణ మొదట లైట్ తీసుకున్నా ఆ తర్వాత అతన్ని వేసేయటానికి రకరకాల స్కెచ్ లు వేస్తాడు. కానీ వీరశంకర్ శక్తి ముందు అవన్నీ తేలిపోతాయి. దాంతో శంకర్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తాడు. ఎన్ని చేసినా వీరశంకర్ తొణకడు. మీసం మీద నుంచి చెయ్యి తీయడు. ఈ నేప‌థ్యంలో వీర‌శంక‌ర్ స్టేష‌న్‌లో ప‌నిచేసే ఓ కానిస్టేబుల్ హ‌త్య‌కి గుర‌వుతాడు. ఆ హ‌త్య‌కీ, క‌ఠారి కృష్ణ‌కి సంబంధం ఏమిటీ..? ఆ హ‌త్య కేసుని వీర‌శంక‌ర్ ఎలా చేధించాడు..? వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేష‌ణ : ఈ సినిమాకు ఎంచుకున్న అసలు కథే చాలా పాతది. అయినా క‌థ‌నంతో ఈ సినిమాకి కొత్త‌ద‌నాన్ని తీసుకొచ్చాడు ద‌ర్శ‌కుడు. జేబులో ఉండాల్పిన నోటు, గోడ‌లి ఉండాల్సిన మేకు, చెట్టుకు ఉండాల్సిన మామిడికాయ అంటూ క‌థ‌ని మొద‌లుపెట్ట‌డం అందులో భాగ‌మే. చాలా మంచి మాస్ ఎలిమెంట్స్ తో నేపథ్యం కుదరడం అతిపెద్ద ప్లస్ పాయింట్. ఇక గోపిచంద్ మలినేని ఈ చిత్రాన్ని తగినంత కమర్షియల్ అంశాలతో పర్ఫెక్ట్ గా ప్యాక్ చేసారు, ఇదే ఆడియన్స్ ను బాగా ఆకర్షిస్తుంది. ముఖ్యంగా మాస్ ఎలివేషన్స్.. ఫైట్స్ మరియు యాక్షన్ సీక్వెన్స్‌లు ఇలా అన్ని బాగున్నాయి. ముఖ్యంగా ఇంట్రవెల్ ఫైట్, క్లైమాక్స్ ఫైట్ అయితే కేక పెట్టించాయి. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే ఎమోషనే. చాలా చోట్ల కట్టిపడేసే ఎమోషన్ సినిమాలో ఉంది.

ఫస్టాఫ్ తర్వాత సినిమా పూర్తిగా రివెంజ్ డ్రామాగా మారిపోయినట్లు కనిపిస్తూంటుంది. శృతిహాసన్ పాత్రకు సినిమాలో పెద్దగా ప్రాధాన్యం లేదు. లుక్స్ కూడా సాదాసీదాగా ఉండడమే కాక ఆవిడ పాత్రకు కాస్త స్కోప్ ఉన్నా దాన్ని పూర్తిగా పక్కనపెట్టినట్లు చేసారు. పోలీస్ పాత్ర‌లో ర‌వితేజ ఒదిగిపోయాడు. స‌ముద్ర ఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ వారి వారి పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించి చిత్రానికి ప్రాణం పోశారు. టెక్నికల్ గానూ మంచి స్టాండర్డ్స్ లో సినిమా ఉండటం మరో ప్లస్. ప్రొడక్షన్ వ్యాల్యూస్ అయితే ఇక చెప్పక్కర్లేదు. ఎడిటింగ్ బాగుంది. త‌మ‌న్ మంచి సంగీతాన్ని అందించాడు. మాస్ సినిమాలను ఇష్టపడేవారికి ఖ‌చ్చితంగా నచ్చుతుంది.Next Story