హైదరాబాద్: నగర సీపీ సజ్జనార్‌ను టాలీవుడ్ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి, నిర్మాత, తెలంగాణ ఫిల్మ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్‌రాజు కలిశారు. ఐబొమ్మ నిర్వహకుడు రవి అరెస్ట్ నేపథ్యంలో సీపీతో వీరు భేటీ అయ్యారు.
పైరసీని అరికట్టేందుకు పోలీసులు చేస్తున్న కృషి చాలా అభినందనీయమని ప్రముఖ సినీ నటుడు నాగార్జున అన్నారు. డిజిటల్ అరెస్ట్ గురించి మాట్లాడుతూ.. తమ కుటుంబంలోనూ ఒకరిని రెండు రోజుల పాటు నిర్బంధించారని తెలిపారు. పోలీసులకు సమాచారం ఇచ్చేలోపు వారు తప్పించుకున్నారని నాగార్జున చెప్పారు. ఐబొమ్మ లాంటి వెబ్‌సైట్లలో ఉచితంగా సినిమా చూస్తున్నామని అనుకోవద్దని, దీని వెనుక చాలా పెద్ద నేరం ఉంటుందన్నారు.
సినిమా పైరసీ చేసేవారు సమాజ సేవ చేయడం లేదని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. సినిమా పైరసీ వెబ్‌సైట్ల ద్వారా తీసుకున్న ప్రజల డేటాను క్రిమినల్స్‌కు విక్రయిస్తున్నారని చెప్పారు. ఫ్రీగా ఏమీ రాదని, ఈ పైరసీ వల్ల ప్రజల డేటా క్రిమినల్స్‌కు చేరుతోందని, దీంతో ప్రజల డబ్బులే కాదు.. ప్రాణాలు కూడా కోల్పొతున్నారని చెప్పారు. దీనిపై ప్రజలు ఆలోచించాలని, పైరసీని ఎంకరేజ్ చేయొద్దని ప్రజలను కోరారు.
సినిమా పైరసీని అరికట్టడానికి తాము చాలా ఏళ్లుగా పోరాడుతున్నామని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సినిమాను నమ్ముకుని చాలా మంది బతుకుతున్నారని చెప్పారు. ఈ పైరసీ మహమ్మారిని ఎదుర్కోవడంతో గత సీపీ సవీ ఆనంద్, ప్రస్తుత సీపీ సజ్జనార్ చూపిన చొరవ అభినందనీయమని తెలిపారు. సినీ పరిశ్రమ కష్టపడి చేసిన సినిమాను.. క్షణాల్లో దోచేసి.. సొమ్ము చేసుకోవడం మంచిదికాదన్నారు. దిల్‌రాజు చేసిన 'గేమ్ ఛేంజర్' సినిమాను కూడా పైరసీ చేశారని పేర్కొన్నారు.