కత్రినా, విక్కీ జంటకు హత్య బెదిరింపులు.. కేసు నమోదు
Katrina Kaif, Vicky Kaushal Get Death Threat On Social Media, Case Filed. బాలీవుడ్ యాక్టర్స్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ జంటకు బెదిరింపులు వచ్చాయి. సోషల్ మీడియా ద్వారా ఓ గుర్తు తెలియని వ్యక్తి
By అంజి Published on 25 July 2022 1:41 PM ISTబాలీవుడ్ యాక్టర్స్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ జంటకు బెదిరింపులు వచ్చాయి. సోషల్ మీడియా ద్వారా ఓ గుర్తు తెలియని వ్యక్తి వారిని చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఈ క్రమంలోని ముంబైలోని శాంటాక్రజ్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కత్రినా, విక్కీలకు బెదిరింపులు వస్తున్నాయని, బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి కత్రినా కైఫ్‌ను వెంటాడుతున్నట్లు పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 506-II (నేరపూరిత బెదిరింపు), 354-డి (స్టాకింగ్) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని అధికారి తెలిపారు. ఐటీ చట్టం ప్రకారం పోలీసులు కేసు బుక్ చేశారు.
నాలుగేళ్లు ప్రేమించుకుని, గతేడాది విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్‌లో ఓ ప్రముఖలో కోటలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇటీవలే ఈ జంట వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లి వచ్చింది. ప్రస్తుతం ఇద్దరు తమ తమ సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న 'టైగర్-3'లో కత్రినా నటిస్తోంది. ఇక విక్కీ కౌశల్ 'గోవిందా నామ్ మేరా', 'ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ', 'డుంకీ' సినిమాలతో బిజీగా ఉన్నాడు.
కొన్ని రోజుల కిందట నటుడు సల్మాన్ ఖాన్, అతని తండ్రి సలీం ఖాన్‌లకు కూడా లేఖ రూపంలో బెదిరింపులు వచ్చాయి. మేలో హత్యకు గురైన పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలాకు ఎదురైన గతే.. ''మీ తండ్రీకొడుకులిద్దరూ ఎదుర్కొంటారని'' అందులో పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత సల్మాన్, అతని కుటుంబ సభ్యులకు పోలీసులు భద్రతను పెంచారు. దర్యాప్తు అధికారుల చెప్పిన దాని ప్రకారం.. బిష్ణోయ్ గ్యాంగ్ బాలీవుడ్ ప్రముఖుల నుండి డబ్బు వసూలు చేయాలని చూస్తోంది. సల్మాన్ శుక్రవారం కొత్తగా నియమితులైన ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్‌ని దక్షిణ ముంబైలోని అతని కార్యాలయంలో కలిశారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. సల్మాన్ ఆయుధ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌కు కూడా ఒక లేఖ ద్వారా హత్య బెదిరింపు వచ్చింది. దాని తర్వాత ముంబై పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై నాన్-కాగ్నిజబుల్ నేరాన్ని నమోదు చేసి, ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు.