ఆ కోరిక తీర‌కుండానే క‌న్నుమూసిన క‌త్తి మ‌హేష్‌

Kathi Mahesh cremation will be done Today.సినీ క్రిటిక్‌, ద‌ర్శ‌కుడు, న‌టుడు కత్తి మ‌హేష్ క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 July 2021 2:36 AM GMT
ఆ కోరిక తీర‌కుండానే క‌న్నుమూసిన క‌త్తి మ‌హేష్‌

సినీ క్రిటిక్‌, ద‌ర్శ‌కుడు, న‌టుడు కత్తి మ‌హేష్ క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. గ‌త నెల 26న నెల్లూరు జిల్లా లో రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్ తీవ్రంగా గాయపడ్డారు. కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు ముందు వెళుతున్న ట్యాంకర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ముందు సీట్లో ఉన్న మహేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయ‌న్ను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తుండ‌గా.. శ‌నివారం ప‌రిస్థితి విష‌మించి క‌న్నుమూశారు. ఆయ‌న అంత్య‌క్రియ‌లు నేడు(ఆదివారం) ఆయ‌న స్వ‌గామంలో జ‌ర‌గ‌నున్నాయి. చిత్తూరు జిల్లా య‌ర్రావారిపాలెం మండ‌లంలోని య‌ల‌మంద‌లో క‌త్తి మ‌హేష్ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు బంధువులు తెలిపారు.

సినీ విమర్శకుడిగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న కత్తి మహేశ్ అకాల మరణంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అతడి మృతి పట్ల స్నేహితులు, అభిమానులు ఘన నివాళులర్పిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికల్లో పోస్టులు పెడుతున్నారు. సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. కత్తి మహేశ్‌లో నటుడు, విమర్శకుడే కాదు మంచి సాహితీ అభిమాని కూడా ఉన్నాడు. పుస్తక సమీక్షలు చేస్తూ సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను వెలిబుచ్చుతుండేవాడు.

అస‌లు క‌త్తి మ‌హేష్ సినిమాల్లో ఎలా వ‌చ్చారు..? బిగ్‌బాస్ అవ‌కాశం ఎలా వ‌చ్చింది అన్న‌ది ఓ సారి చూద్దాం. చిన్న‌ప్ప‌టి నుంచి మ‌హేష్‌కు సినిమాలంటే అమిత ఆస‌క్తి. వేస‌వి సెల‌వులు వ‌స్తే చాలు రోజు సినిమాకు వెళ్లేవార‌ట‌. ఎవ‌రైనా సినిమా బాగోలేదు అని చెబితే.. ఎందుకు బాగాలేదో తెలుసుకునేందుకు ఆ సినిమా చూసేవార‌ట‌. సినిమాల‌పై ఆస‌క్తితో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు ప్రోడ‌క్ష‌న్ హౌస్‌లో రాఘ‌వేంద్ర మ‌హ‌త్య్మం సీరియ‌ల్‌కు ప‌నిచేశారు. ఆ త‌రువాత యూనిసెఫ్ వ‌ర‌ల్డ్ బ్యాంకు, సెవ్ ది చిల్ట్ర‌న్ తదిత‌ర సంస్త‌ల్లో ప‌నిచేశారు.

బిగ్‌బాస్‌లో అవ‌కాశం కూడా అనుకోకుండా వ‌చ్చిందే. స్టార్ మా నుంచి కాల్ రాగానే ఏదైనా సినిమా కోసం ఏమో అనుకున్నార‌ట‌. కానీ బిగ్‌బాస్ కోసం అని చెప్ప‌డంతో ఆశ్చ‌ర్య‌పోయార‌ట‌. అలా బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన ఆయ‌న దాదాపు నాలుగు వారాల పాటు ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. వ్యాఖ్యాత ఎన్టీఆర్ త‌న‌ని ఎంత‌గానో ప్రోత్స‌హించార‌ని క‌త్తి మ‌హేష్ ప‌లు సంద‌ర్భాల్లో చెప్పారు. బిగ్‌బాస్‌కు ముందు తాను చాలా త‌క్కువ మందికే తెలుసని, ఆ త‌రువాత కొన్ని కోట్ల మందికి తెలిశాన‌ని, త‌న‌కు వ‌చ్చిన గుర్తింపున‌కు కార‌ణం బిగ్‌బాస్ షోనేన‌ని మ‌హేష్ చెప్పేవారు. మొద‌టి వారంలోనే తాను వెళ్లిపోతాన‌ని అనుకున్నాన‌ని.. తాను నాలుగు వారాలు ఉండ‌డం నిజంగా గ్రేట్ అనేవారు.

ఎప్ప‌టికైనా మంచి సందేశాత్మ‌క చిత్రం తీయాల‌ని క‌త్తి మ‌హేష్ అనుకునేవారు. ఆయ‌న తన కోరిక తీర‌కుండానే వెళ్లిపోయారు. యావ‌త్ సినీ ప‌రిశ్ర‌మ ఆయ‌న‌కు నివాళి అర్పిస్తోంది.

Next Story