కార్తీ 'సుల్తాన్'.. సినిమా రివ్యూ..!
Karthi Sulthan Movie Review. కార్తీ 'సుల్తాన్' సినిమా రివ్యూ.
By Medi Samrat Published on 2 April 2021 10:01 AM GMTసినిమా: సుల్తాన్
దర్శకత్వం: భాగ్యరాజ్ కన్నన్
నటీనటులు: కార్తీ, రష్మిక, లాల్, యోగిబాబు, నెపోలియన్.. తదితరులు
నిర్మాత: ఎస్.ఆర్.ప్రభు
రన్ టైమ్: 157 నిమిషాలు
రిలీజ్ డేట్: ఏప్రిల్ 2
కార్తీ.. సినిమా అంటే తెలుగు వారికి కూడా ఎంతో ఆసక్తి. తెలుగులో కార్తీ మార్కెట్ కూడా ఎక్కువే..! ఇక చాలా రోజుల తర్వాత కార్తీ 'సుల్తాన్' సినిమాతో వెండితెర మీద సందడి చేయనున్నాడు. తమిళంలోనూ ఈ సినిమా భారీ ఎత్తున విడుదలైంది. 'కౌరవుల పక్కన శ్రీ కృష్ణుడు ఉంటే పరిస్థితి ఎలా ఉండేది' అన్నది ఈ సినిమా ట్రైలర్ తోనే మనం ఒక అంచనాకు వస్తాం. ముఖ్యంగా 100 మంది బ్యాచ్ కలిగి ఉన్న సుల్తాన్ తన బ్యాచ్ తో సమాజానికి ఎలా ఉపయోగపడ్డాడు అన్నది కూడా సినిమా చూస్తే అర్థమవుతుంది.
కథ:
సుల్తాన్ అలియాస్ విక్రమ్(కార్తీ) ఒక డాన్ కొడుకు(నెపోలియన్).. సుల్తాన్ ను కనగానే అతడి తల్లి మరణిస్తుంది. సుల్తాన్ తండ్రి దగ్గర ఉన్న రౌడీలు, అతడి మామయ్య(లాల్) చిన్నప్పటి నుండి పెంచి తల్లి లేని లోటు లేకుండా పోషిస్తారు. ముంబైలో ఉద్యోగం చేసుకుంటూ ఓ కంపెనీ పెట్టాలని అనుకునే సుల్తాన్.. వారం రోజులు ట్రిప్ కోసం వైజాగ్ లో ఉంటున్న తన తండ్రి దగ్గరకు వస్తాడు. అలా వచ్చిన సమయంలో తన తండ్రి మీద, అతడి దగ్గర ఉన్న గూండాల మీద అటాక్ జరుగుతుంది. ఇది చేయించింది పోలీసులేనని తెలుసుకుని.. పోలీసు కమీషనర్ ను కలుస్తాడు. పోలీసులు రౌడీలను ఎన్ కౌంటర్ చేయాలని భావిస్తున్నారని తెలుసుకుని.. తన తండ్రి దగ్గర పని చేస్తున్న రౌడీల ప్రాణాలను కాపాడడాన్ని తన భుజాల మీద వేసుకుంటాడు. వారిని రౌడీయిజానికి దూరం చేస్తానని.. ఒక్క కేసు వారి మీద పడినా కూడా పోలీసులు ఏమైనా చేసుకోవచ్చని చెబుతాడు. అప్పటికే సుల్తాన్ తండ్రి కూడా మరణించడంతో రౌడీలను తీసుకుని వేరే ఊరికి వెళ్తాడు. ఆ ఊరి రైతులకు అప్పటికే సుల్తాన్ తండ్రి ఓ మాట ఇచ్చి ఉంటాడు.. ఆ మాటను సుల్తాన్ నెరవేరుస్తాడా..? తన అన్నలుగా భావిస్తున్న రౌడీలను ఏ గొడవ కూడా పడకుండా ఎలా కంట్రోల్ చేస్తాడు..? ఆ ఊరికి ఉన్న సమస్య ఏమిటి అన్నది...? తెర మీదనే చూడాలి..!
నటీనటులు:
సినిమాకు కార్తీ ఎంత బలాన్ని ఇచ్చాడో సన్నివేశాలను బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. కామెడీ సీన్లలో కానీ.. 100 మంది రౌడీలను కంట్రోల్ చేయడంలో కానీ చాలా వరకూ కొత్తగా కార్తీ కనిపిస్తాడు. యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక రష్మిక పల్లెటూరి పిల్ల లాగా క్యూట్ గా కనిపిస్తుంది. వీరిద్దరి తర్వాత ముఖ్యమైన పాత్ర చేసిన లాల్.. కంటతడి కూడా పెట్టిస్తాడు. ఇక వంద మంది రౌడీలతో కలిసి కార్తీ సీన్లు కూడా బాగున్నాయి. యోగి బాబు కామెడీ కూడా పర్వాలేదు.
విశ్లేషణ:
కథ గతంలో తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన సినిమాల్లాగా అనిపిస్తుంది. కానీ దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్ కథ ఎక్కడా బోర్ కొట్టించకుండా ముందుకు తీసుకుని వెళ్ళాడు. ఇక యాక్షన్ సీన్స్ ను బాగా తీశాడు. కాస్త ప్రెడిక్టబుల్ కథనే అయినప్పటికీ చాలా వరకూ ముందుకు సాగుతూ వెళుతుంది. సెకండాఫ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ విషయంలో సత్యన్ సూరన్ ను తప్పకుండా మెచ్చుకోవాలి. ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ మాత్రం అదిరిపోయాయని చెప్పొచ్చు. ఏ మాత్రం నిరుత్సాహ పరచదు. ముఖ్యంగా మాస్ కు బాగా కనెక్ట్ అవుతుంది. కాస్త తమిళ వాసనలు ఎక్కువగా అనిపిస్తుంది. సాంగ్స్ తెలుగు వాళ్లకు ఎక్కడం కాస్త కష్టమే..! కానీ యువన్ శంకర్ రాజా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్ అని అంటారు. ఎడిటింగ్ విషయంలో ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగున్ను.
ప్లస్ పాయింట్స్:
కార్తీ, రష్మిక నటన
కౌరవుల వైపు కృష్ణుడు ఉన్నాడనే కాన్సెప్ట్
ఇంటర్వెల్ సీన్స్
యాక్షన్ సీన్స్
బ్యాగ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్:
సెకండాఫ్ లో కొంచెం లాగినట్లు అనిపించే సీన్స్
సాంగ్స్
రేటింగ్: 3/5