నటికి వేధింపులు.. టీవీ సీరియల్ నటుడు అరెస్టు
ప్రముఖ కన్నడ టీవీ సీరియల్ నటుడు చరిత్ బాలప్పను పోలీసులు అరెస్టు చేశారు.
By M.S.R Published on 28 Dec 2024 6:15 AM ISTప్రముఖ కన్నడ టీవీ సీరియల్ నటుడు చరిత్ బాలప్పను పోలీసులు అరెస్టు చేశారు. ఓ నటికి చెందిన ప్రైవేట్ వీడియోల ద్వారా లైంగిక వేధింపులకు గురిచేసి బ్లాక్ మెయిల్ చేసిన ఆరోపణలపై కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. 29 ఏళ్ల నటి చేసిన ఫిర్యాదు మేరకు రాజరాజేశ్వరి నగర్ పోలీసులు నటుడిని అరెస్టు చేశారు. పోలీసులు అతనిపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.
2023 నుంచి 2024 మధ్య డిసెంబర్ 13న వేధింపులు ఎదుర్కొన్నట్లు సదరు నటి తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు ముందుకు వచ్చిందని డీసీపీ (వెస్ట్) ఎస్ గిరీష్ శుక్రవారం తెలిపారు. 2017 నుంచి కన్నడ, తెలుగు సీరియల్స్‌లో నటిస్తున్న నటితో నిందితుడికి 2023లో పరిచయం ఏర్పడింది. చరిత్ తనను మానసికంగా వేధించడంతోపాటు చంపేస్తానని కూడా బెదిరించినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడు తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి తెచ్చేవాడని, తన అనుచరులతో కలిసి నటి ఇంటి వద్ద నానా హంగామా చేసేవాడని తెలిపారు. ప్రైవేటు వీడియోలు బయటపెడతానని, సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని, నటీనటుల వాట్సాప్ గ్రూపులో వాటిని షేర్ చేస్తానని బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉండడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.