మరో విషాదం.. యువ నటి సౌజన్య ఆత్మహత్య
Kannada television actress Soujanya dies by suicide.ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.
By తోట వంశీ కుమార్
ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది నటీనటులు మృత్యువాత పడగా.. మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుండడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో జూనియర్ ఆర్టిస్ట్ కావలి అనురాధ ఆత్మహత్య చేసుకున్న వార్తను జీర్ణించుకోకముందే మరో నటి తన నివాసంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
బెంగుళూరులోని కుంబల్‌గోడులో కన్నడ నటి సౌజన్య తన అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకుంది. 25 ఏళ్ల సౌజన్య మరణవార్త కన్నడ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలిసిన వివరాల మేరకు.. ఆమె ఉంటున్న అపార్ట్‌మెంట్ తలుపులను పగలకొట్టి చూడగా.. ఉరి వేసుకున్న స్థితిలో ఓ మృతదేహం కనిపించింది. ఆ మృతదేహం కాలుపై ఉన్న టాటూ(పచ్చబొట్టు) ఆధారంగా ఆ మృతదేహం సౌజన్యదేనని పోలీసులు గుర్తించారు. ఆమె ఉరివేసుకుని రెండు లేదా మూడు రోజులు అయి ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆ గదిలో ఓ సూసైడ్ నోటు దొరికింది.
అందులో తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని రాసి ఉంది. తన తల్లిదండ్రులకు క్షమాపణలు కోరింది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని.. తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలతో మానసికంగా బాధపడుతున్నట్లు తెలిపింది. తనకు సాయం చేసిన వారిందరికి ధన్యవాదాలు తెలియజేసింది. సౌజన్య టీవీ సీరియల్స్‌తో పాటు పలు చిత్రాల్లోనూ నటించింది. ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.