సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒకరి మరణాన్ని జీర్ణించుకోలేకముందే మరొకరు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రముఖ కన్నడ దర్శకుడు ప్రదీప్ రాజ్ కరోనాతో కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం ఆయనకు కరోనా సోకగా.. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. ఆయన పరిస్థితి విషమించడంతో గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 46 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కాగా.. ప్రదీప్ రాజ్ గత 15 ఏళ్లుగా మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు కరోనా సోకడంతో.. చికిత్సకు ఆయన శరీరం సరిగ్గా స్పందించలేదని వైద్యులు తెలిపారు. ఆయన అంత్యక్రియలు పాండిచేర్చిలో జరగనున్నాయి. ప్రదీప్ రాజ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన మరణంతో కన్నడ సిని ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కేజీఎఫ్ హీరో యశ్ హీరోగా 'కిచ్చా', 'కిరాతక' అనే చిత్రాలను ప్రదీప్ రాజ్ తెరకెక్కించారు. ఈ చిత్రాలు ఘన విజయం సాధించడంతో పాటు కన్నడలో యశ్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇవే కాక.. 'గోల్డెన్ స్టార్ మిస్టర్', 'రజనీకాంత', 'సతీష్ నీనాసం', 'అంజాద్ మాలే' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. యష్ తో కలిసి 'కిరాతక 2' చిత్రాన్ని తెరకెక్కిస్తానని ఇటీవల ఓ సందర్భంలో ఆయన చెప్పారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయన్నారు. ఆ కల నెరవేరకుండానే ఇంతలోనే ఈ విషాదం చోటు చేసుకుంది.