నేను డబ్బు కోసం పెళ్లిళ్లలో డ్యాన్స్ చేయను : కంగనా

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన అభిప్రాయాలతో ఎప్పుడూ వార్త‌ల్లో ఉంటుంది. బాలీవుడ్ స్టార్స్ అంతా అంబానీ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌కు హాజరు కాగా

By Medi Samrat  Published on  6 March 2024 8:22 PM IST
నేను డబ్బు కోసం పెళ్లిళ్లలో డ్యాన్స్ చేయను : కంగనా

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన అభిప్రాయాలతో ఎప్పుడూ వార్త‌ల్లో ఉంటుంది. బాలీవుడ్ స్టార్స్ అంతా అంబానీ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌కు హాజరు కాగా.. కంగనా మాత్రం ఆ ఫంక్షన్‌లో కనిపించలేదు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు ఇటీవల జామ్‌నగర్‌కు చేరుకున్న పరిశ్రమ తారలపై సోషల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించింది.

లతా మంగేష్కర్‌తో కంగ‌నా తనను తాను పోల్చుకుంటూ ఇన్‌స్టాలో.. 'లతా జీ లాగా, నేను ఏ ప్రైవేట్ ఈవెంట్‌లో పాల్గొన‌డానికి ఎప్పుడూ ఆఫర్ తీసుకోలేదు.' దీనితో పాటు ఆమె ఒక కథనం యొక్క ఫోటోను కూడా షేర్ చేసింది, అందులో 'ఎవరైనా 5 మిలియన్లు ఇచ్చినా.. పెళ్లిళ్లలో పాడనని లతా మంగేష్కర్ చెప్పింది' అని హెడ్డింగ్‌ ఉంది. 'నేను నా జీవితంలో చాలా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాను. నాకు ఎంత డబ్బు ఆఫర్ చేసినా.. నేను పెళ్లిళ్లలో ఎప్పుడూ డాన్స్ చేయను. నాకు ఇప్పటి వరకు చాలా సూపర్‌హిట్ ఐటెం సాంగ్ ఆఫర్స్ వచ్చాయి కానీ ఇప్పటి వరకూ ఆ ఆఫర్‌లను అంగీకరించలేదు. అవార్డు షోలకు కూడా దూరంగా ఉన్నాను. కీర్తి, డబ్బును తిరస్కరించడానికి బలమైన వ్యక్తిత్వం, గౌరవం అవసరం. ఈ షార్ట్‌కట్‌ల ప్రపంచంలో.. నిజాయితీతో మాత్రమే డబ్బు సంపాదించాల‌ని నేటి యువత అర్థం చేసుకోవాలని పేర్కొంది.


అయితే.. కంగనా రనౌత్ తన పోస్ట్‌లో ఎవరి పేరును ప్ర‌స్తావించ‌లేదు. అయితే ఆమె అంబానీ కొడుకు పెళ్లిలో పాల్గొన్న బాలీవుడ్ న‌టుల‌ గురించే ఈ కామెంట్లు చేసింద‌ని అంటున్నారు. షారూక్‌, స‌ల్మాన్ స‌హా ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌కు హాజరైన ప‌లువురుప్రముఖులు ఇటీవల జామ్‌నగర్‌కు చేరుకుని అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్‌లో ప్రదర్శన ఇచ్చారు.

Next Story