'కల్కి' టికెట్ ధరలు పెంపు.. ఏపీ, తెలంగాణలో రేట్లు ఇలా..
'కల్కి 2898 ఏడీ' సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 23 Jun 2024 1:49 AM GMT'కల్కి' టికెట్ ధరలు పెంపు.. ఏపీ, తెలంగాణలో రేట్లు ఇలా..
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఈనెల 27న థియేటర్లలో విడుదల కాబోతుంది. అయితే.. ఈ మూవీ టికెట్ల రేట్లు పెంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు అనుమతి ఇచ్చాయి. టికెట్ ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. తెలంగాణలో కల్కి టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌లో రూ.75 వరకు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.
పెరిగిన టికెట్ ధరలతో కలుపుకొంటే కల్కి మూవీకి టికెట్ రేట్లు సింగిల్ స్క్రీన్‌లో రూ.265 వరకు, మల్టీప్లెక్స్‌లో రూ.413 వరకు ఉండనున్నాయి. ఈ ధరలతో పాటు ట్యాక్స్‌లను కూడా అదనంగా వసూలు చేయనున్నారు. మరోవైపు బెనిఫిట్ షోకు కూడా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఉదయం 5.30 గంటలకు స్క్రీనింగ్ చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ బెనిఫిట్ షో టికెట్ ధరలను కూడా ప్రభుత్వం జీవోలో వెల్లడించింది. బెనిఫిట్ షోస్‌కు సింగిల్ స్క్రీన్‌లో రూ.377, మల్టీప్లెక్స్‌లో రూ. 495గా టికెట్ ధరలు ఉండనున్నాయి. ఈ నెల 27వ తేదీ నుంచి జూలై 4వ తేదీ వరకు అంటే 8 రోజుల పాటు పెరిగిన ధరలు అమల్లో ఉంటాయి.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో కల్కి 2898 ఏడీ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు కూటమి ప్రభుత్వం సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సింగిల్ స్క్రీన్‌తో పాటు మల్టీప్లెక్స్‌లలో వంద రూపాయలను పెంచుకునేందుకు అనుతులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఏపీలో సినిమా టికెట్ ధరల పెంపుపై సోమవారం వరకు జీవో వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ ఎప్పుడంటే..
ఏపీలో టికెట్ రేట్లకు సంబంధించిన ఉత్తర్వులు జారీ కాగానే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కల్కి 2898 ఏడీ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు చాలా మంది ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్న తరుణంలో అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో జరుగుతాయని అంచనా ఉంది. మరోవైపు అమెరికాలో రిలీజ్ కు వారం ముందే కల్కి అడ్వాన్స్ బుకింగ్స్ రెండు మిలియన్లు దాటిన విషయం తెలిసిందే.