ఏపీ సీఎం జగన్ కు సీనియ‌ర్ న‌టుడు కైకాల లేఖ‌

Kaikala Satyanarayana wrote a letter to Chief Minister Jagan.సీనియ‌ర్ న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ గ‌తేడాది న‌వంబ‌ర్‌లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Jan 2022 12:03 PM IST
ఏపీ సీఎం జగన్ కు సీనియ‌ర్ న‌టుడు కైకాల లేఖ‌

సీనియ‌ర్ న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ గ‌తేడాది న‌వంబ‌ర్‌లో అనారోగ్యం పాలై అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ఆయ‌న ఆరోగ్యం పూర్తిగా మెరుగుప‌డింది. ఈ క్ర‌మంలో ఆయ‌న ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ కు గురువారం ఉద‌యం లేఖ రాశారు. తాను అనారోగ్యానికి గురైన స‌మ‌యంలో త‌న కుటుంబానికి అండ‌గా నిలిచిన సీఎం జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

'ఇటీవ‌ల అనారోగ్యంతో నేను ఆస్ప‌త్రిలో ఉన్న వేళ‌.. మీరు నాకు అండ‌గా నిలిచినందుకు ధ‌న్య‌వాదాలు. బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా కాల్ చేసి, ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందిస్తామని హామీ ఇవ్వడం ద్వారా మీరు చూపిన శ్రద్ధ పట్ల నేను చాలా సంతోషిస్తున్నాను. మీరు హామీ ఇచ్చినట్టుగానే మీ ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా హాజరయ్యారు. వైద్య ఖర్చులను తీర్చడానికి ఆర్థిక సహాయంతో సహా అన్ని రకాల సహాయాన్ని అందించారు. ఆ కష్ట సమయాల్లో మీ సహాయం నాకు, నా కుటుంబానికి ఎంతో ధైర్యాన్ని అందించింది. మీరు చూపిన ఈ శ్రద్ధ మీకు కళాకారుల పట్ల మరియు వారి శ్రేయస్సు పట్ల ఉన్న గౌరవాన్ని మరోసారి రుజువు చేసింది' అని కైకాల స‌త్య‌నారాయ‌ణ ఆ లేఖలో పేర్కొన్నారు.

తాను సంతకం చేయలేక పోవడంతో, తన కుమారుడు ఈ కృతజ్ఞతా లేఖపై సంతకం చేశారని ఆయన వెల్లడించారు. అంతేకాక తనకు బాగోనప్పుడు తన కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని ఆయ‌న ఈ సంద‌ర్భంగా తెలిపారు.


Next Story