ప్రముఖ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ పక్షవాతానికి గురైయ్యాడు. ఈ విషయాన్ని అతడు స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ముఖ పక్షవాతానికి గురికావడంతో ఈ వారం అతడు నిర్వహించాల్సిన పలు షోలను రద్దు చేశారు. తాను త్వరలోనే కోలుకుంటానని, అంత వరకు ఓపిక పట్టాలని తనను అభిమానించేవారికి అతడు సూచించాడు. ఇక జస్టిన్ బీబర్ త్వరగా కోలుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతడి అభిమానులు కోరుకుంటున్నారు.
28 ఏళ్ల స్టార్ సింగర్ తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో ఏం మాట్లాడాలంటే.. రామ్‌సే హంట్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నానని తెలిపాడు. అందువల్ల తన ముఖంలో పక్షవాతం వచ్చినట్లు చెప్పాడు. ముఖంపై కుడివైపున పక్షవాతం వచ్చిందని, ఆ కారణంగా కన్ను ఆడించలేకపోతున్నానని, ఇక కుడి వైపున చిరునవ్వు కూడా కనిపించదని, ఆ సైడ్ మొత్తం పెరాలసిస్ వచ్చినట్లు తెలిపాడు.
వాస్తవానికి ఫిబ్రవరిలో బీబర్ తన జస్టిస్ వరల్డ్ టూర్‌ను ప్రారంభించాడు. ఈ వ్యాధి కారణంగా బీబర్ టొరంటో, వాషింగ్టన్ డీసీ తదితర పర్యటలను రద్దు చేసుకున్నాడు. తాను పూర్తిగా కోలుకునే వరకు ఎటువంటి సంగీత ప్రదర్శనలు ఉండవని ప్రకటించాడు. చెవిలో ఉన్న నాడికి వైరస్ సోకడం వల్ల ముఖానికి పక్షవాతం వచ్చినట్లు బీబర్ చెప్పాడు. ఇక ఈ ఏడాది అక్టోబర్‌లో ఇండియాలో బీబర్ తన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం బీబర్ ముఖ పక్షవాతానికి గురికావడంతో ఆ షో పై సందిగ్థత నెలకొంది.