టాలీవుడ్‌లో మరో విషాదం.. జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతి రెడ్డి మృతి.. నిద్రమత్తులో రైలు ఎక్కబోయి
Junior Artist Jyothi Reddy died in Shadnagar Railway station.టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది.
By తోట వంశీ కుమార్ Published on 19 Jan 2022 2:56 AM GMT
టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. కదులుతున్న రైలు ఎక్కబోయి జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి తీవ్రంగా గాయపడింది. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. కడపకు చెందిన జ్యోతిరెడ్డి(28) హైదరాబాద్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఉద్యోగిగా పని చేస్తోంది. సినిమాల్లో రాణించాలని జూనియర్ ఆర్టిస్టుగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. సంక్రాంతి పండుగ కోసం సొంతూరు వెళ్లిన జ్యోతి సోమవారం రాత్రి తిరుగుప్రయాణం అయ్యింది. మంగళవారం ఉదయం 5.30 గంటల సమయంలో రైలు షాద్‌నగర్‌లో ఆగింది.
అయితే.. నిద్రమత్తులో ఉన్న జ్యోతి.. తాను దిగాల్సిన కాచిగూడ స్టేషన్ వచ్చిందని బావించి షాద్‌నగర్‌లో రైలు దిగింది. అయితే.. అది షాద్‌నగర్ అని తెలుసుకున్న జ్యోతి కంగారులో తిరిగి రైలు ఎక్కేందుకు ప్రయత్నించింది. అప్పటికే రైలు కదులుతుండడంతో అదుపుతప్పి రైలుకు, ఫ్లాట్‌ఫాంకు మధ్యలో పడిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే.. చికిత్స పొందుతూ జ్యోతి మృతి చెందింది. జ్యోతి మరణించిందని తెలుసుకున్న జూనియర్ ఆర్టిస్టులు ఆమె మృతికి రైల్వే వారి నిర్లక్ష్యమే కారణమంటూ ఆస్పత్రి ఎదుట కొంతసేపు ఆందోళనకు దిగారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.