అభిమానులకు క్షమాపణలు చెప్పిన ఎన్టీఆర్
Jr.NTR Speech at Brahmastra Pre Release Event.రణ్‌బీర్ కపూర్, అలియాభట్ జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్రం.
By తోట వంశీ కుమార్ Published on 3 Sept 2022 7:50 AM ISTరణ్‌బీర్ కపూర్, అలియాభట్ జంటగా నటించిన చిత్రం 'బ్రహ్మాస్త్రం'. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, అమితాబ్ బచ్చన్, మౌనీరాయ్ కీలక పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. హిందీతో పాటు తెలుగు, తమిళం భాషల్లో సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఈ క్రమంలో శుక్రవారం తెలుగు ప్రీ రిలీజ్ ఈ వెంట్‌ను పెద్ద ఎత్తున రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే.. వినాయక చవితి దృష్ట్యా భద్రతా కారణాల వల్ల పోలీసులు ఈ వేడుకకు అనుమతి నిరాకరించారు.
ఈవెంట్ రద్దు కావడంతో పార్క్ హయాత్ హోటల్‌కి మార్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి వచ్చిన, రావాలనుకున్న అభిమానులకు ముందుగా క్షమాపణలు చెప్పారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఎంతో ఆర్భాటంగా చేద్దామని అనుకున్నారని, వినాయక విగ్రహాల నిమజ్జనాల నేపథ్యంలో అధిక బందోబస్తును ఏర్పాటు చేయలేమని పోలీస్ డిపార్ట్‌మెంట్ చెప్పిందన్నారు. అందుకే అభిమానుల మధ్య కోలాహలంగా ఈవెంట్ జరపడం కుదరలేదన్నారు.
అమితాబ్ బచ్చన్ ప్రభావం ఓ నటుడిగా తనపై ఉందన్నారు. ఆయనకు తాను వీరాభిమానిని తారక్ చెప్పాడు. అమితాబ్ తరువాత అంతగా ఇష్టపడేది రణ్‌బీర్‌నేనని చెప్పుకొచ్చాడు. అతడితో కలిసి వేదికను పంచుకోవడం ఆనందంగా ఉందన్నాడు. ఈ చిత్రం పెద్ద విజయం అందుకోవాలని ఆకాంక్షించారు.