ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చింతామణి నాటకంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై కళాకారులు, తెలుగు బాషా ప్రేమికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. విశాఖలోని మద్దిలపాలెం జంక్షన్‌లో తెలుగు తల్లి విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఇందులో జబర్దస్త్ నటుడు అప్పారావు పాల్గొన్నారు. చింతామణి నాటకంపై ఉన్న నిషేదాన్ని వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు.
చింతామణి నాటకానికి గొప్ప చరిత్ర ఉందని అప్పారావు అన్నారు. 1920లో మహాకవి కాళ్ళకూరి నారాయణరావు గారు ఈ నాటకాన్ని రాశారన్నారు. ప్రభుత్వం ఏ ప్రాతిపదికన చింతామణి నాటకాన్ని నిషేధించిందో అర్థం కాలేదన్నారు. ఆ నాటకంలో సుబ్బిశెట్టి ది కేవలం ఓ చిన్న పాత్ర మాత్రమేనని.. చింతామణి నాటకం ఒక సామాజిక సందేశాన్ని ఇస్తుందన్నారు. సంఘీ భావంతో కూడిన మీటింగ్ పెట్టి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. కళాకారులను, కళలను ప్రోత్సహించే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తాను ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. దీనిపై వివాదం చేయడం తగదని ఆయన అన్నారు.
అంతకముందు అప్పారావు మద్దిలపాలెం కూడలి వద్ద నిర్వహిస్తున్న కొవిడ్ ప్రచారంలో పాల్గొన్నారు. వాహనదారులకు మాస్కులు పంపిణీ చేశారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.