ఆ పేరుతోనే ఏడడుగులు.. విజయ్, రష్మిక మ్యారేజ్ అఫీషియల్!

గత కొంతకాలంగా సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఊహాగానాలకు తెరపడింది. టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ...

By -  అంజి
Published on : 23 Feb 2026 7:00 AM IST

Vijay Deverakonda, Rashmika Mandanna, Virosh Wedding, Geetha Govindam, Tollywood News

ఆ పేరుతోనే ఏడడుగులు.. విజయ్, రష్మిక మ్యారేజ్ అఫీషియల్!

హైదరాబాద్: గత కొంతకాలంగా సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఊహాగానాలకు తెరపడింది. టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న తమ బంధాన్ని అధికారికం చేశారు. తమ వివాహ నిశ్చయంతో పాటు, ఈ వేడుకకు అభిమానులు పెట్టిన పేరునే ఖరారు చేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్‌ను పంచుకున్నారు. తమ పెళ్లిని “The Wedding of VIROSH” గా పిలవనున్నట్లు ఈ జంట ప్రకటించింది. ఈ పేరు వెనుక ఉన్న కథను వివరిస్తూ.. ఇది ఏ వెడ్డింగ్ ప్లానర్ లేదా కుటుంబ సభ్యులు పెట్టిన పేరు కాదని, ఏళ్ల క్రితమే అభిమానులు తమ ఇద్దరి పేర్లను కలిపి (Vijay + Rashmika = Virosh) సృష్టించిన ప్రేమాభిమాన చిహ్నమని వారు పేర్కొన్నారు. తమ బంధానికి పునాది వేసిన అభిమానుల గౌరవార్థం ఈ పేరునే ఖరారు చేసినట్లు తెలిపారు.

"మా ప్రియమైన అభిమానులారా.. మేము ఏదైనా ప్లాన్ చేసే ముందే, మా కోసం మేము ఏదైనా ఎంచుకునే ముందే మీరు మా పక్కన ఉన్నారు. ఎంతో ప్రేమతో మీరు మాకు ఒక పేరు ఇచ్చారు.. అదే 'విరోష్'. అందుకే ఈరోజు మా కలయికకు మీరిచ్చిన పేరునే పెట్టుకుంటున్నాం. మమ్మల్ని ఎంతో ప్రేమతో ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు ఎప్పటికీ మాలో భాగమే" అని వారు తమ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ జంట ఫిబ్రవరి 26న వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరగనుంది. 2018లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'గీత గోవిందం'తో ఈ జంట తొలిసారి తెరపై కనిపించింది. వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత 2019లో 'డియర్ కామ్రేడ్' చిత్రంలో మరోసారి జతకట్టారు. అప్పటి నుండి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నప్పటికీ, ఇప్పటివరకు వారు కేవలం "మంచి స్నేహితులం" అని మాత్రమే చెబుతూ వచ్చారు.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం VD13 చిత్రంతో పాటు పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రష్మిక మందన్న తెలుగుతో పాటు హిందీలోనూ అగ్ర కథానాయికగా రాణిస్తున్నారు. ఇటీవల ఆయుష్మాన్ ఖురానాతో కలిసి నటించిన 'థమ్మా' సినిమాతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందారు.

Next Story