సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. భారత దేశం నుంచి ఆస్కార్‌కు నామినేట్ అయిన 'ఛెల్లో షో(ద లాస్ట్ షో)' చిత్రంలో అద్భుతంగా నటించిన బాల నటుడు రాహుల్ కోలీ మరణించాడు. అతడి వయస్సు 15 సంవత్సరాలు. ల్యుకేమియా వ్యాధితో ఈ నెల2న రాహుల్ అహ్మదాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మరణించాడు. ఈ నెల 14న 'చెల్లో షో' చిత్రాన్ని వీక్షించాలని అనుకున్నామని, అయితే.. ఇంతలో ఈ దారుణం చోటు చేసుకుందని తల్లి దండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ చెప్పారు.
"అక్టోబర్ 2న ఉదయం రాహుల్ టిఫిన్ చేశాను. కొద్ది సేపటికే అతడు తీవ్ర జ్వరంతో బాధపడ్డాడు. మూడు సార్లు రక్తపు వాంతులు చేసుకున్నాడు. వెంటనే ఆస్పత్రికి తరలించాం. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. కళ్ల ముందే కుమారుడు మరణించాడు. అతడి మరణవార్తతో మా ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది. అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. జామ్‌నగర్‌లో రాహుల్ అంత్యక్రియలు పూర్తి అయ్యాక అక్టోబర్ 14న ఛెల్లో ఫో చిత్రాన్ని చూస్తాం." అని రాహుల్ తండ్రి రాము కోలీ చెప్పాడు.
సినిమాలపై అమితమైన ప్రేమ కలిగిన ఓ తొమ్మిదేళ్ల యువకుడి జీవితం ఎలా సాగిందన్న నేపథ్యంలో 'ఛెల్లో షో' సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ఆరుగురు చిన్నారులు నటించగా వారిలో రాహుల్ కోలీ ఒకడు. అతడి మరణవార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.