బిగ్‌బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ షోకు చాలా మంది అభిమానులే ఉన్నారు. బుల్లితెరపై తెలుగు బిగ్‌బాస్ షో విజయవంతంగా ఐదు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇన్నాళ్లు బుల్లితెరపై అలరించిన బిగ్‌బాస్ షో ఇక ఓటీటీ వేదికగా సందడి చేయనుంది. డిస్నీ+హాట్ స్టార్ వేదికగా బిగ్‌బాస్ నాన్‌స్టాప్ పేరుతో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమైంది. కింగ్ అక్కినేని నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ఈ షో.. 87 రోజులు 24/7 పాటు హౌస్‌లో ఏం జరుగుతుందో చూసేలా ఏర్పాట్లు చేశారు.
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ తొలి కంటెస్టెంట్‌గా 'పుష్ప' చిత్రంలోని 'ఉ అంటావా మామ.. 'పాటతో అషురెడ్డి ఎంట్రీ ఇచ్చింది. తాను గేమ్ ఆడితే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ చెప్పుకొచ్చింది. ఆ తరువాత మహేష్ విట్టా, ముమైత్‌ఖాన్, అజయ్, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతు, ఆరియానా, నటరాజ్ మాస్టర్, శ్రీరాపక, అనిల్ రాథోడ్, మిత్ర శర్మ, తేజస్విని మదివాడ, సరయు, శివ, బిందు మాధవి, హమీదా, అఖిల్ సార్థక్ లు హౌస్‌లోనికి వెళ్లారు. రేపటి నుంచి కంటెస్టెంట్ల గొడవలు, ప్రేమలు, కోపాలు, అలకలతో షో రక్తికట్టించబోతోంది. ఇన్నాళ్లు బుల్లితెరపై ఓ గంట మాత్రమే ప్రసారమై మంచి రేటింగ్స్ సాధించిన ఈ షో.. ఓటీటీ వేదికగా ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి మరీ.