ఇటీవల భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా 'మంజుమ్మెల్ బాయ్స్'. తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఈ సినిమాలో 'కమ్మని ఈ ప్రేమ లేఖలే' సాంగ్ ను బాగా వాడుకున్నారు. అయితే కాపీరైట్ ఉల్లంఘనపై 'మంజుమ్మెల్ బాయ్స్' నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీలకు మ్యూజిక్ మాస్ట్రో, రాజ్యసభ ఎంపీ ఇళయరాజా లీగల్ నోటీసు జారీ చేశారు. కమల్ హాసన్ 'గుణ'లోని ఇళయరాజా ఐకానిక్ 'కణ్మణి అన్బోడు' పాటను సినిమాలోని కీలకమైన సమయంలో టీమ్ అనధికారికంగా ఉపయోగించిందని ఇళయరాజా లీగల్ టీమ్ ఆరోపించింది. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ మలయాళ చిత్రం క్లైమాక్స్‌లో ఈ పాటను ఉపయోగించారు. పలు సీన్స్ లో కూడా ఇళయరాజా సాంగ్ రిఫరెన్స్ ఉంటుంది.
ఇళయరాజా బృందం కాపీరైట్ ఉల్లంఘనను క్లెయిమ్ చేసింది. సినిమాలో పాట వినియోగాన్ని కొనసాగించడానికి సరైన అనుమతి తీసుకోవాలని నిర్మాతలను కోరింది. 'మంజుమ్మెల్ బాయ్స్' తమిళనాడులోని కొడైకెనాల్‌లోని గుణ గుహలలో కథ నడుస్తుంది. స్నేహితుల బృందంలో ఒకరిని రక్షించడం గురించి ఈ కథ సాగుతుంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రం ఇది.