క్షమాపణలు చెప్పిన హైపర్ ఆది
Hyper Aadi apologise telangana people.బతుకమ్మ, గౌరమ్మ వివాదంపై జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది క్షమాపణలు చెప్పారు.
By తోట వంశీ కుమార్
బతుకమ్మ, గౌరమ్మ వివాదంపై జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది క్షమాపణలు చెప్పారు. తమకు ఎవరినీ కించపర్చే ఉద్దేశ్యం లేదన్నారు. ఒకవేళ ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే దానికి నిర్మోహమాటంగా క్షమాపణ కోరుతున్నానన్నారు. ఆ రోజు స్కిట్ లో పాల్గొన్న అందరి తరుపున కూడా క్షమాపణలు కోరుతున్నానని ఆది వెల్లడించారు. ఆంధ్ర, తెలంగాణ అనే బేధాబిప్రాయాలు మా షో లో లేవని ఆయన చెప్పుకొచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల అందరి అభిమానాలు మాపై ఉన్నాయని అందుకే తమ షోలు అంతగా తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయన్నారు.
జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆది.. తెలంగాణ యాస, భాష సంస్కృతిని అవమానపరిచాడని, బతుకమ్మ, గౌరమ్మలను కించపరుస్తూ మాట్లాడాడని తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బేషరతుగా క్షమాపణలు చెప్పేదాక తాము వదిలిపెట్టమని.. కావాల్సి వస్తే న్యాయపరంగా వెళ్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే హైపర్ ఆది క్షమాపణలు చెబుతూ రాత్రి వీడియో విడుదల చేశారు.
పత్రికాముఖంగా క్షమాపణలు చెప్పాల్సిందే..
జబర్దస్ ఫేమ్ హైపర్ ఆదికి తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది. సంస్కృతి, సంప్రదాయాలను అవహేళన చేసి ఇలా వ్యక్తిగత సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పడం సరికాదని.. టీవీ ఛానెళ్లు, పత్రికాముఖంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్(టీజేఎస్ఎఫ్) అధ్యక్షుడు నవీన్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఆరోపణలుగా వాటిని చెప్పడం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా.. కేవలం తప్పించుకునే ధోరణిలో మాట్లాడుతున్నారని విమర్శించారు. సరైన సమయంలో సరైన రీతిలో బుద్ధి చెప్తామని.. షూటింగులను సైతం అడ్డుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని నవీన్ అన్నారు.