డైరెక్టర్‌ రాఘవేంద్రరావుకి హైకోర్టు నోటీసులు

ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్ర రావుకి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది.

By Srikanth Gundamalla
Published on : 10 Nov 2023 9:29 AM IST

High court, notice,  director, raghavendra rao,

డైరెక్టర్‌ రాఘవేంద్రరావుకి హైకోర్టు నోటీసులు

ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్ర రావుకి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. సినీ పరిశ్రమకు ప్రభుత్వం కేటాయించిన భూమిని రాఘవేంద్రరావు సొంత అవసరాలకు వాడుకున్నారని ఆరోపిస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలు అయ్యింది. తాజాగా ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. రాఘవేంద్రరావు, ఆయన బంధువులకు మరోసారి నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రాంతం షేక్‌పేటలో 2 ఎకరాలను ప్రభుత్వం సినీ పరిశ్రమకు కేటాయించింది. ఇదే పిటిషన్‌పై గతంలో విచారించిన హైకోర్టులో.. మొదట్లోనే నోటీసులు జారీ చేసింది. అయితే.. అప్పుడు జారీ చేసిన నోటీసులు రాఘవేంద్రరావుకి అందలేదని రికార్డుల్లో నమోదు చేశారు. దాంతో.. గురువారం విచారణ జరిపిన న్యాయస్థానం మరోసారి వారికి నోటీసులు జారీ చేసింది. ఇక తదుపరి విచారణను హైకోర్టు ధర్మాసనం జనవరి 18వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

2012లోనే ఈ ప్రజాప్రయోజన పిటిషన్‌ను మెదక్‌కు చెందిన బాలకిషన్‌ అనే వ్యక్తి హైకోర్టులో దాఖలు చేశారు. సర్వే నెం.403/1లోని 2 ఎకరాల భూమిని వాణిజ్య అవసరాలకు వినియోగించడం నిబంధనలకు విరుద్ధమని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. గురువారం ఈ పిటిషన్‌ను హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అలోక్ అరథే, జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్ కుమార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ప్రతివాదులైన రాఘవేంద్రరావు, ఆయన బంధువులు కృష్ణమోహన్‌రావు, చక్రవర్తి, విజయలక్ష్మి, అఖిలాండేశ్వి తో పాటు లాలస దేవికి నోటీసులు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు.

Next Story