ఆరోగ్య పరిస్థితిపై హీరో విక్రమ్​ వీడియో సందేశం.. ఏమన్నారంటే?

Hero Vikram's video message on health. ఛాతీ నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తోంది.

By అంజి  Published on  10 July 2022 11:53 AM IST
ఆరోగ్య పరిస్థితిపై హీరో విక్రమ్​ వీడియో సందేశం.. ఏమన్నారంటే?

ఛాతీ నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. వీడియోలో విక్రమే స్వయంగా మాట్లాడుతూ కనిపించారు. ప్రస్తుతం తన హెల్త్‌ బాగానే ఉందని చెప్పారు. తనపై లవ్, అభిమానం చూపించిన ప్రతిఒక్కరికీ థ్యాంక్స్ చెప్పారు. ఇంతమంది తనపై ప్రేమ చూపించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అయితే విక్రమ్ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు, ఫ్యాన్స్.. ఆయన కోలుకోవడం ఆనందగా పోస్టులు పెడుతున్నారు. కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాలని, ఆ తర్వాతే షూటింగ్స్‌లో పాల్గొనాలని అభిమానులు సూచిస్తున్నారు.

ఈ నెల 8న విక్రమ్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వార్తలు వచ్చాయి. ఆయనకు హార్ట్‌ స్ట్రోక్ వచ్చిందని, క్రిటికల్ కండీషన్‌లో ఉన్నారని సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది. అయితే.. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని విక్రమ్ సన్నిహితులు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని విక్రమ్‌ చేరిన చెన్నైలోని కావేరి ఆస్పత్రి వైద్యులు కూడా స్పష్టం చేశారు. ఛాతి నొప్పి కారణంగానే విక్రమ్ ఆస్పత్రికి వచ్చారని చెబుతూ ఆ రోజు సాయంత్రం మెడికల్ బులెటిన్ విడుదల చేశారు. విక్రమ్ ఆస్పత్రిలో చేరారన్న విషయం తెలుసుకుని ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ప్రస్తుతం విక్రమ్ నటించిన 'కోబ్రా' సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

Next Story