సూర్య-పూజ హెగ్డే కాంబినేషన్ లో తెరకెక్కిన 'రెట్రో' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశ చరిత్ర, కశ్మీర్‌లో ఉగ్రవాదం గురించి మాట్లాడారు. ఛావా సినిమా చూసిన తర్వాత ఔరంగజేబు పాలన పట్ల తనకు చాలా కోపం వచ్చిందని, చరిత్రలో వెనక్కి వెళ్ళే అవకాశం ఇస్తే ఔరంగజేబును కొట్టేసి వస్తానని అన్నారు.
"బ్రిటిష్ వారిని కలుసుకుని వాళ్ళను రెండు చెంపదెబ్బలు కొట్టాలనుకుంటున్నాను. ఇటీవల ఛావా చూశాను, ఔరంగజేబుకు రెండు మూడు చెంపదెబ్బలు కొట్టేస్తాను. అలాంటి చాలా మందిని కలవాలని, వారిని కొట్టాలని మాత్రమే కోరుకుంటున్నాను. ప్రస్తుతం, నాకు అది మాత్రమే గుర్తుకు వస్తుంది." అని విజయ్ దేవరకొండ తెలిపారు. కశ్మీర్ లోయలో ఉగ్రవాద సమస్యకు ఏకైక పరిష్కారం అక్కడి ప్రజలకు చదువు చెప్పించడమేనని దేవరకొండ అన్నారు. పాకిస్థాన్ ప్రజలే ఆ దేశ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసేలా ఉన్నారని కూడా విజయ్ వివరించారు.