స్టార్ హీరో సూర్యకు బెదిరింపులు.. ఇంటి వద్ద హై సెక్యూరిటీ
Hero Suriya's house at a high security.కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన చిత్రం జై భీమ్. ఇటీవల ఓటీటీలో విడుదలై ఈ
By తోట వంశీ కుమార్ Published on 17 Nov 2021 10:13 AM ISTకోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన చిత్రం 'జై భీమ్'. ఇటీవల ఓటీటీలో విడుదలై ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే.. ఈ చిత్రం పలు వివాదాల్లో చిక్కుకుంది. తమ సంఘం ప్రతిష్టను దిగజార్చారు అని వన్నియార్ సంఘం చిత్రబృందం సూర్య, జ్యోతిక, దర్శకుడు టీజే జ్ఞానవేల్, అమెజాన్ ప్రైమ్ కు లీగల్ నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే. తమకు క్షమాపణలు చెప్పాలని రూ. 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని అందులో పేర్కొన్నారు. కాగా.. ఇది వాస్తవ ఘటన ఆధారంగానే తెరకెక్కించిన చిత్రం మాత్రేనని.. ఇందులో పాత్రలు, పేర్లు మార్చామని చిత్రబృందం చెబుతోంది.
ఇలా.. ఇటు వన్నియర్ సంఘం, అటు చిత్రబృందం మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగానే.. హీరో సూర్యకు బెదిరింపులు వస్తున్నాయి. నటుడు సూర్య ని కొట్టిన వారికీ ఏకంగా లక్ష రూపాయిలు బహుమానాన్ని పీఎంకే నేతలు ప్రకటించారు. ఇలా రోజు రోజుకి సూర్యకు బెదిరింపులు ఎక్కువ అవుతుండడంతో పోలీసులు ఆయనకు భద్రతను కల్పించారు. ప్రస్తుతం తమిళనాడు టి.నగర్‌లోని ఆయన నివాసం వద్ద పోలీసులు భద్రతను కల్పించారు. సూర్య ఇంటి లోపల ఐదుగురు సాయుధ పోలీసులను మోహరించారు.
సూర్య, జ్యోతిక 2డి ప్రొడక్షన్స్ పై 'జై భీమ్' చిత్రాన్ని నిర్మించారు. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దీపావళి కానుకగా ఓటీటీలో విడుదలైంది. 1993లో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా ఈచిత్రం తెరకెక్కింది. అప్పట్లో పోలీసుల తీరు వల్ల ఓ గిరిజన వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం.. అతడి భార్య న్యాయపోరాటం చేయడం.. మొత్తం పోలీసు యంత్రాంగాన్ని ప్రశ్నించడం, న్యాయానికి హారతులు పట్టడమే చిత్ర కథ. ఈ చిత్రంలో సూర్య, మణికందన్, లిజోమోల్ జోస్ ప్రధాన పాత్రలు పోషించారు. నిర్మాణ బృందం గిరిజన ప్రజల సంక్షేమం కోసం సీఎం స్టాలిన్‌కు రూ.1 కోటి విరాళాలు ఇచ్చింది. సూర్య కూడా తన భర్తను కోల్పోయిన నిజమైన చినతల్లికి రూ.10 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు.