నాని 'ది ప్యారడైజ్' రిలీజ్ వాయిదా.. కొత్త డేట్ ఫిక్స్!
నేచురల్ స్టార్ నాని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’ విడుదల వాయిదా పడింది.
By - అంజి |
నాని 'ది ప్యారడైజ్' రిలీజ్ వాయిదా.. కొత్త డేట్ ఫిక్స్!
నేచురల్ స్టార్ నాని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’ విడుదల వాయిదా పడింది. ముందుగా ఈ చిత్రాన్ని 2026, మార్చి 26న విడుదల చేయాలని భావించినప్పటికీ, తాజాగా మేకర్స్ కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం ఇప్పుడు ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
సినిమా వాయిదాపై చిత్ర యూనిట్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ.. "మేము తొందరపడాలనుకోవడం లేదు. అత్యుత్తమ అవుట్‌పుట్ ఇవ్వడానికి మాకు సమయం కావాలి" అని పేర్కొన్నారు. క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే ఈ ఐదు నెలల జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. 2023లో వచ్చిన బ్లాక్ బస్టర్ 'దసరా' తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రమిది. ఇందులో నాని 'ధగడ్' అనే వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు.
2025 జూన్ 21న షూటింగ్ ప్రారంభమైన సమయంలో విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నాని గ్రీన్ కలర్ లెదర్ షూస్, కాలికి గొలుసుతో ఊరమాస్ లుక్‌లో కనిపించి అంచనాలను పెంచేశారు. హక్కుల కోసం పోరాడే ఒక అణగారిన గిరిజన తెగ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. తరతరాలుగా దోపిడీకి గురవుతున్న ఆ సమాజం కోసం ఒక కొత్త నాయకుడు ఎలా ఎదిగాడు, వ్యవస్థను ఎలా ఎదిరించాడు అనేదే ఈ చిత్ర ప్రధానాంశం.
ఈ సినిమాలో హీరోయిన్‌గా కయాదు లోహార్ నటిస్తున్నారు. విలన్‌గా రాఘవ్ జుయల్ నటిస్తున్నారు. ఆగస్టులో విడుదల చేయడం వల్ల రాఖీ పండగ, జన్మాష్టమి వంటి సెలవులు ఈ సినిమాకు కలిసి రానున్నాయి. అలాగే మార్చిలో రాబోతున్న 'టాక్సిక్', 'ధురంధర్ 2' వంటి భారీ చిత్రాల పోటీని కూడా ఈ సినిమా తప్పించుకున్నట్లయింది.