సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం.. యువ న‌టుడు హ‌రి వైర‌వ‌న్ క‌న్నుమూత‌

Hari Vairavan of Vennila Kabadi Kuzhu fame dies.యువ న‌టుడు హ‌రి వైర‌వ‌న్ క‌న్నుమూశాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Dec 2022 8:31 AM IST
సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం.. యువ న‌టుడు హ‌రి వైర‌వ‌న్ క‌న్నుమూత‌

సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటు చేసుకుంది. యువ న‌టుడు హ‌రి వైర‌వ‌న్ క‌న్నుమూశాడు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న చికిత్స పొందుతూ శుక్ర‌వారం రాత్రి తుదిశ్వాస విడిచారు. శ‌నివారం మ‌ధురైలో ఆయ‌న అంత్య‌క్రియ‌లు జ‌రిగాయి. హ‌రి వైర‌వ‌న్ అకాల మ‌ర‌ణం ప‌ట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతాపం తెలియ‌జేస్తున్నారు.

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుశీంద్రన్ తెరకెక్కించిన 'వెన్న‌లా క‌బడ్డీ కుళు' చిత్రంతో న‌టుడిగా ప‌రిచ‌యం అయ్యారు. ఆ సినిమాలో విష్ణు విశాల్ మిత్రుల్లో ఒక‌రిగా క‌నిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హ‌రి వైర‌వ‌న్. ఆ త‌రువాత 'వెన్న‌లా క‌బ‌డ్డీ కుళు-2', 'కుళ్లు న‌రి కూట్టం' వంటి సినిమాల్లో న‌టించి ప్రేక్ష‌కుల మ‌దిలో చెద‌ర‌ని ముద్ర వేశాడు.

గ‌త కొంత‌కాలంగా కిడ్నీ సంబంధింత స‌మ‌స్య‌తో ఆయ‌న బాధ‌ప‌డుతున్నారు. మధురైలో వైద్య చికిత్స పొందుతూ వ‌చ్చారు. సినీ ప‌రిశ్ర‌మ‌లో అవకాశాలు లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న‌ట్లు కోలీవుడ్ మీడియా తెలిపింది. ఆఖ‌రికి చికిత్స చేయించుకునే స్తోమ‌త లేక చ‌నిపోయాడ‌ని అంటున్నారు. హ‌రి వైరవన్ మృతి ప‌ట్ల విష్ణు విశాల్‌, బ్లాక్ పాండి, అంబానీ శంక‌ర్ త‌దిత‌ర ప్ర‌ముఖుల సంతాపం తెలిపారు. హ‌రి వైర‌వ‌న్‌కు భార్య క‌విత‌, రెండేళ్ల కుమార్తె రోషిణీ శ్రీ ఉన్నారు. హరి వైర‌వ‌న్ మ‌ర‌ణించ‌డంతో అత‌డి కుటుంబం జీవ‌నాధారం ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. చిత్ర ప‌రిశ్ర‌మ ఆదుకోవాల‌ని ఆయ‌న భార్య మీడియా ద్వారా వేడుకున్నారు.

Next Story