హీరో ఆర్యపై రాష్ట్రపతి, ప్రధానికి ఫిర్యాదు చేసిన జర్మన్ మహిళ
German woman case against Tamil actor Arya.తమిళ యువ హీరో ఆర్యకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
By తోట వంశీ కుమార్ Published on 20 Feb 2021 5:25 AM GMT
తమిళ యువ హీరో ఆర్యకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన చిత్రాలు తమిళ్‌తో పాటు తెలుగులో విడుదల అవుతూ.. మంచి విజయాలను సొంతం సొంతం చేసుకున్నాయి. హీరోయిన్ సాయేషా సైగల్‌ను ఆర్య పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఆర్య తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ జర్మన్ యువతి ఏకంగా రాష్ట్రపతికి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తన నుంచి రూ.80లక్షలు తీసుకున్నాడని అందులో ఆరోపించింది. తన నుంచి తీసుకున్న నగదును తనకు తిరిగి ఇప్పించాలని వేడుకుంది.
సదరు జర్మనీ యువతి చెన్నైలోని ఓ వైద్య సేవల సంస్థలో పనిచేస్తోంది. మహ్మద్ అర్మాన్, హుస్సేనీ అనే వ్యక్తుల ద్వారా తనకు ఆర్య పరిచయం అయినట్టు తెలిపింది. లాక్ డౌన్ సమయంలో తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని ఆర్య చెప్పడంతో.. ఆర్య తల్లి జమీలా సమక్షంలోనే డబ్బులు ఇచ్చానని చెప్పింది. తానిచ్చిన నగదు తిరిగి ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినా ఫలితం లేకపోయిందని, తన విజ్ఞప్తుల పట్ల ఆర్య తల్లి కూడా సరిగా స్పందించలేదని వాపోయింది. తనను ఇష్టపడుతున్నానని.. పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించాడని ఆతరువాత మోసం చేశాడని తెలిపింది.
తనలాగే మరికొందరిని కూడా అతడు మోసం చేశాడని చెప్పింది. అంతకు సంబంధించిన కొన్ని సాక్ష్యాలు తన దగ్గర ఉన్నాయని.. తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరింది. చాలా చోట్ల ఫిర్యాదు చేసిన వాళ్లకున్న పలుకుబడి కారణంగా తనకు న్యాయం జరగలేదని.. చివరి ఆశగా లేఖ రాసానని రాష్ట్రపతి, ప్రధానమంత్రికి పంపిన పిర్యాదులో పేర్కొంది.