చిరంజీవి గారు మీరు సెల్ఫీలు ఆపితే నా ప్రసంగం మొదలెడతా.. : గరికపాటి నరసింహరావు
Garikapati is serious in Alai Balai program in Nampally.హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆలయ్ బలయ్
By తోట వంశీ కుమార్ Published on 6 Oct 2022 1:14 PM GMT![చిరంజీవి గారు మీరు సెల్ఫీలు ఆపితే నా ప్రసంగం మొదలెడతా.. : గరికపాటి నరసింహరావు చిరంజీవి గారు మీరు సెల్ఫీలు ఆపితే నా ప్రసంగం మొదలెడతా.. : గరికపాటి నరసింహరావు](https://telugu.newsmeter.in/h-upload/2022/10/06/330069-untitled-4-copy.webp)
దసరా పండుగ సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించినట్లుగానే ఈ ఏడాది కూడా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. అయితే.. ఇక్కడ ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
మెగాస్టార్ చిరంజీవి వేదికపైకి రాగానే అబిమానులు ఫోటో సెషన్‌ను నిర్వహించారు. అయితే.. అదే సమయంలో గరికపాటి నరసింహరావు తన ప్రసంగాన్ని ప్రారంభించారు. చిరంజీవితో ఫోటోలు దిగేందుకు జనం ఎగబడడంతో గరికపాటి ప్రసంగానికి అంతరాయం కలిగింది. దీంతో సెల్ఫీలు ఆపితేనే ప్రసంగాన్ని కొనసాగిస్తానని, లేదంటే ఇక్కడి నుంచి వెళ్లిపోతానని గరికపాటి కాస్త గట్టిగానే చెప్పారు. వెంటనే అక్కడ ఉన్నవారు ఆయనకు సర్దిచెప్పారు.
సెల్ఫీలు ఆపి గరికపాటికి చిరంజీవి క్షమాపణ చెప్పారు. గరికపాటి ప్రసంగాలు అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పుకొచ్చారు చిరంజీవి. వీలు చూసుకుని ఓ రోజు ఇంటికి భోజనానికి రావాలని గరికపాటిని ఆహ్వానించారు మెగాస్టార్.
ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ..మతాలు, కులాలు, వర్గాలకు అతీతంగా నిర్వహిస్తున్న గొప్ప సమ్మేళనం అలయ్ బలయ్ అని కొనియాడారు. ఇలాంటి గొప్ప కార్యక్రమం విశ్వవ్యాప్తం కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రేమ, సోదరాభావం అనే గొప్ప సందేశాన్ని ఇస్తున్న ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమ సందేశాన్ని జనంలోకి తీసుకెళ్లాలని చిరు పిలుపునిచ్చారు.