టాన్సిల్స్ సర్జరీ ఓ అందమైన యువతి ప్రాణాలు తీసింది. సర్జరీ విఫలం కావడంతో రెండు నెలల పాటు కోమాలో ఉన్న ఆమె సోమవారం కన్నుమూసింది. ఈ ఘటన బ్రెజిల్ లో చోటు చేసుకుంది.
గ్లెయిసీ కొరియా.. 2018లో మిస్ యునైటెడ్ కాంటినెంట్స్ బ్రెజిల్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. అనంతరం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా రాణిస్తోంది. గొంతు టాన్సిల్స్ తొలగించుకునేందుకు ఏప్రిల్ 4వ తేదీన ఆమె ఓ ఆస్పత్రిలో సర్జరీ చేయించుకుంది. అయితే.. సర్జరీ అయిన నాలుగు రోజుల తర్వాత ఆమె మెదడులో రక్తస్రావం అయ్యింది. దీంతో పాటు గుండె పోటు కూడా వచ్చింది. ఈ క్రమంలో గ్లెయిసీ కొరియా కోమాలోకి వెళ్లిపోయింది. ఆమెను కాపాడేందుకు వైద్యులు ఎంతో ప్రయత్నించారు. అయితే.. రెండు నెలల పాటు కోమాలో ఉన్న గ్లెయిసీ జూన్ 20న కన్నుమూసింది. ఆమె వయస్సు 27 సంవత్సరాలు.
రియో డీ జనెరియోకు ఈశాన్యంగా ఉండే మకాయే నగరంలో పుట్టిన గ్లెయిసీ మోడలింగ్ రంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఆమె మరణం తమ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసిందని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. కొరియా ఎంతో ప్రేమగల అమ్మాయి అని, ఆమె లేకుండా తాము తమ జీవితాలను కొనసాగించడం కష్టమని చెప్పుకొచ్చారు. ఇక ఆమె అభిమానులు సైతం సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు.