హైదరాబాద్: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. నిన్నటితో గడువు ముగియగా ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది. రాగా రిమాండ్ విధించిన మరుసటి రోజే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి విడుదలయ్యారు. రిమాండ్ పూర్తి ప్రాసెస్‌లో భాగంగా ఐకాన్ స్టార్ ఇవాళ కోర్టుకు హాజరుకానున్నారు.
సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీ తేజ్ ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు సంధ్యా థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్, బాన్సర్ల పై కేసు నమోదు చేశారు. అందర్నీ అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. అదే విధంగా హీరో అల్లు అర్జున్ ని కూడా పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరచగా.. కోర్టు విచారణ జరిపి 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది.
అదే సమయంలో ఈ కేసులో అల్లు అర్జున్‌కు హైకోర్టు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్, అతని న్యాయవాదులు నాంపల్లి కోర్టుకు చేరుకొని హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్లుగా కోర్టుకు తెలుపనున్నారు. అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు నాంపల్లి కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకి ఆదేశాలు జారీచేసింది.