బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విషాదం.. అభిమాని మృతి

Fan Dies at Bimbisara Pre Release Event.నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ న‌టించిన తాజా చిత్రం బింబిసార‌. వశిష్ఠ్‌ దర్శకత్వంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 July 2022 1:09 PM IST
బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విషాదం.. అభిమాని మృతి

నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ న‌టించిన తాజా చిత్రం 'బింబిసార‌'. వశిష్ఠ్‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో కేథరిన్, సంయుక్తా మీనన్ క‌థానాయిక‌లుగా న‌టించారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం ఆగ‌స్టు 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం సాయంత్రం ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈ వెంట్‌ను హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో అట్ట‌హాసంగా జ‌రిగింది. ఈ వేడ‌క‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎన్టీఆర్ వ‌స్తున్నాడు అని తెలియ‌డంతో పెద్ద ఎత్తున అభిమానులు వ‌ర్షాన్ని సైతం లెక్క చేయ‌కుండా ఈ వేడుక‌కు త‌ర‌లివ‌చ్చారు.

అయితే.. ఈ వేడ‌క‌లో విషాదం చోటు చేసుకుంది. పుట్టా సాయిరామ్ అనే అభిమాని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు అత‌డి మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి త‌ర‌లించారు. ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి గూడెంకి చెందిన పుట్టా సాయిరామ్ అనే వ్యక్తి హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ జాబ్ చేస్తూ కూకట్ పల్లిలో నివాసం ఉంటున్నాడు. నందమూరి అభిమాని కావ‌డంతో బింబిసార ప్రీ రిలీజ్ ఈ వెంట్‌కు హాజ‌రైయ్యాడ‌ని తెలుస్తోంది. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అభిమానుల మ‌ధ్య తోపులాట జ‌రిగిందా..? లేదా ఇంకా ఏదైన కార‌ణం ఉందా..? అన్న కోణంలోనూ పోలీసులు విచార‌ణ చేస్తున్నారు.

కాగా.. ఈ ఘ‌ట‌నపై చిత్ర బృందం స్పందించింది." దురదృష్టకరమైన, హృదయ విదారక ఈ సంఘటన మా దృష్టికి వ‌చ్చింది. నిన్న రాత్రి బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు చెందిన పుట్ట సాయికుమార్ హాజ‌రైయ్యారు. అయితే.. దుర‌దృష్ట‌వ‌శాత్తు అత‌డు మ‌న మ‌ధ్య‌లో లేడు. అత‌డి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటున్నాము" అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ లేఖ‌ను విడుద‌ల చేసింది.

Next Story