ప్రముఖ కార్టూనిస్ట్, 'డుంబు' సృష్టికర్త బుజ్జాయి క‌న్నుమూత‌

Famous Cartoonist Bujjai is no more.దివంగత కవిదిగ్గజం దేవులపల్లి కృష్ణశాస్త్రి కుమారుడు, ప్ర‌ముఖ చిత్ర‌కారుడు,

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Jan 2022 3:27 AM GMT
ప్రముఖ కార్టూనిస్ట్, డుంబు సృష్టికర్త బుజ్జాయి క‌న్నుమూత‌

దివంగత కవిదిగ్గజం దేవులపల్లి కృష్ణశాస్త్రి కుమారుడు, ప్ర‌ముఖ చిత్ర‌కారుడు, కార్టూనిస్టు, పిల్ల‌ల‌కు ఎంతో ఇష్ట‌మైన 'డుంబు' సృష్టిక‌ర్త సుబ్బరాయశాస్త్రి (బుజ్జాయి) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న గురువారం రాత్రి చైన్నైలోని స్వ‌గృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌స్సు 91 సంవ‌త్స‌రాలు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు, చిత్రకారులు సంతాపం తెలిపారు.

1931 సెప్టెంబరు 11న తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో జన్మించిన సుబ్బరాయశాస్త్రికి చిన్నతనం నుంచి చిత్రలేఖనమంటే మక్కువ. తండ్రి చేయి ప‌ట్టుకుని సాహితి, సాంస్కృతిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డం త‌ప్పితే ఏ రోజు పాఠ‌శాల‌కు వెళ్ల‌లేదు. సాంప్ర‌దాయ‌క చ‌దువులు చ‌ద‌వ‌క‌పోయినా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక పేరును సంపాదించుకున్నారు. తన కార్టూన్లలో 'బుజ్జాయి'గా చిరపరిచితుడైన ఆయన.. భారత్‌కు సరికొత్త కామిక్స్‌ కథల్ని పరిచయం చేశారు.

17ఏళ్ల ప్రాయంలోనే 'బానిస పిల్ల' పేరుతో 30 పేజీల బొమ్మల కథా పుస్తకాన్ని అచ్చు వేయగా.. అది వేలాది కాపీలు అమ్ముడుపోయింది. 1963లో సంపూర్ణ 'పంచతంత్రం' 'ఇలస్ర్టేటెడ్‌ వీక్లీ ఆఫ్‌ ఇండియా'లో ధారావాహికంగా ఐదేళ్లు ప్రచురించారు. అది ఆయనకు జాతీయ స్థాయిలో పేరు తెచ్చిపెట్టింది. 'డుంబు' పాత్రను సృష్టించిన ఆయన.. దాని పేరుతో 1954లో ఆంధ్రప్రభలో సీరియల్‌ నిర్వహించారు. తెలుగు, తమిళ్‌, హిందీ, కన్నడ, ఆంగ్ల భాషల్లో వందకు పైగా చిన్నారుల కామిక్స్‌, కథల పుస్తకాలు ముద్రించారు.

'మిత్రలాభం', 'మిత్రభేదం' పుస్తకాలుగా ఇవి తెలుగులోనూ దొరుకుతున్నాయి. పలు భారతీయ భాషల్లో 42కు పైగా బొమ్మల కథలు వివిధ పత్రికలలో సంవత్సరాల పాటు సీరియల్ గా వచ్చాయి. తెలుగు, తమిళ భాషల్లో 15 కార్టూన్ కథల పుస్తకాలను వెలువరించారు. శ్రీ బుజ్జాయి 2010లో 'నాన్న-నేను' అనే స్వీయచరిత్ర పుస్తకాన్నిరాశారు. 1959, 1960, 1961లలో వరుసగా కేంద్రప్రభుత్వం ప్రోత్సాహక అవార్డులు ఇవ్వగా.. 1992లో ఏపీ ప్రభుత్వం 'బాలబంధు' బిరుదుతో ఆయ‌న్ను సత్కరించింది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన తన కుమారునికి తన తండ్రి పేరు 'దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి' అని పెట్టుకున్నారు. కుమారుడు కూడా రచయితే.

Next Story