ప్రముఖ నటి ఎస్టేల్ హారిస్ కన్నుమూశారు. శనివారం కాలిఫోర్నియాలోని ఆమె నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 93 సంవత్సరాలు. ఆమె సహజంగా(వృద్దాప్యం కారణంగా) మృతి చెందారని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా.. ఏప్రిల్ 4, 1928లో న్యూయార్క్ నగరంలో జన్మించిన ఎస్టేల్ హారిస్ తన పుట్టిన రోజుకు రెండు రోజుల ముందు మృతి చెందారు. ఆమె మరణ వార్త తెలిసిన అభిమానులు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
'శనివారం సాయంత్రం 6.25 గంటలకు ఎస్టేల్ హారిస్ ఇక లేరు అన్న వార్తను చెప్పడానికి చాలా బాధగా ఉంది. ఆమె దయ, అభిరుచి, సున్నితత్వం, హాస్యం, తాదాత్మ్యం, ప్రేమ ఆచరణాత్మకంగా ఎవ్వరూ ఇవ్వలేనివి. ఆమెకు తెలిసిన వారందరి కోసం ఆమె పరితపించేది.' అని ఎస్టేల్ హారిస్ కుమారుడు గ్లెన్ హారిస్ తెలిపాడు.
'జెర్రీ సీన్ ఫెల్డ్' షోలో 'ఎస్టేల్ కోస్టాంజా' పాత్రలో ఎస్టేల్ హారిస్ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో జాసన్ అలెగ్జాండర్ తల్లి ఎస్టేల్ కోస్టాంజాగా ప్రేక్షకుల మన్ననలు పొందారు. తన గాత్రంతో అందరిని కట్టిపడేసింది. 'ది సూట్ లైఫ్ ఆఫ్ జాక్ అండ్ కోడి', 'టార్జాన్ 2' వంటి చిత్రాల్లో నటించి అలరించింది.