టిక్కెట్ ధ‌ర‌ల త‌గ్గింపుపై 'ఆర్ఆర్ఆర్' నిర్మాత ట్వీట్‌

DVV Danayya tweet on ticket prices in AP.ఏపీలో సినిమా టిక్కెట్ ధ‌ర‌ల త‌గ్గింపు 'ఆర్ఆర్ఆర్ ( రౌద్రం రణం రుధిరం )'

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Nov 2021 11:27 AM IST
టిక్కెట్ ధ‌ర‌ల త‌గ్గింపుపై ఆర్ఆర్ఆర్ నిర్మాత ట్వీట్‌

ఏపీలో సినిమా టిక్కెట్ ధ‌ర‌ల త‌గ్గింపు 'ఆర్ఆర్ఆర్ ( రౌద్రం రణం రుధిరం )' చిత్రంపై తీవ్ర ప్ర‌భావాన్ని చూప‌నుంద‌ని.. దీంతో ఆ చిత్ర బృందం త్వ‌ర‌లో కోర్టును ఆశ్ర‌యిచనున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా వీటిపై 'ఆర్ఆర్ఆర్' చిత్ర నిర్మాత డీవీవీ దాన‌య్య స్పందించారు. ఏపీలో టిక్కెట్ ధ‌ర‌ల త‌గ్గింపుపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ ధ‌ర‌లు త‌గ్గించ‌డం అనేది మా సినిమాపై తీవ్ర ప్ర‌భావాన్ని చూపించే అవ‌కాశం ఉంద‌న్నాడు. కాగా.. ఈ విష‌యంపై న్యాయం కోరుతూ మేము లేదా ఆర్ఆర్ఆర్ టీమ్ కోర్టును ఆశ్ర‌యించ‌డం లేదు. గౌర‌వ‌నీయులైన ఏపీ సీఎం జ‌గ‌న్‌ని క‌లిసి మా ప‌రిస్థితిని తెలియ‌జేయ‌నున్నాం. స‌రైన ప‌రిష్కారం చూపమ‌ని వారిని కోర‌తామ‌ని దాన‌య్య ట్వీట్ చేశారు.

ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. అల్లూరి సీతారామరాజుగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నారు. దాదాపు రూ.450కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా తెర‌కెక్కింది. కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఒలివియా మోరీస్‌, ఆలియా భ‌ట్ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. శ్రియ‌, స‌ముద్ర‌ఖ‌ని, అజ‌య్ దేవ్‌గ‌ణ్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఇక ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7, 2022న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story