రకుల్ అభ్యర్థన.. తిరస్కరించిన ఈడీ

Drug case Rakul Preet Singh seeks more time from ED.టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. టాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Sep 2021 10:34 AM GMT
రకుల్ అభ్యర్థన.. తిరస్కరించిన ఈడీ

టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. టాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో 12 మంది ప్రముఖులకు ఈడీ నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే..! ఎక్సైజ్‌ విభాగానికి చెందిన సిట్‌ దాఖలు చేసిన చార్జ్‌షీట్ల ఆధారంగా మనీల్యాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేసింది. వీటికి సంబంధించి విచారణకు హాజరుకావాలని 10 మంది టాలీవుడ్‌ ప్రముఖులు సహా 12 మందికి నోటీసులు పంపింది. వీరిలో పూరీ జగన్నాథ్, రానా దగ్గుబాటి, రకుల్‌ప్రీత్‌ సింగ్, చార్మి, రవితేజ, నవ్‌దీప్, ముమైత్‌ ఖాన్, తనీష్, తరుణ్, నందులతోపాటు రవితేజ డ్రైవర్‌ శ్రీనివాస్, ఎఫ్‌–క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌ కూడా ఉన్నారు. వీరిని ఆగష్టు 31 నుంచి సెప్టెంబర్‌ 22 వరకు విచారించనున్నారు. 2017 జూలైలోనే టాలీవుడ్‌ ప్రముఖులతోసహా మొత్తం 62 మంది అనుమానితుల నుంచి జుట్టు, గోళ్ల నమునాలను సేకరించింది. ఆగస్టు 31: పూరీ జగన్నాథ్‌ విచారణ పూర్తవ్వగా.. సెప్టెంబర్‌ 2న అంటే నేడు చార్మీ కౌర్‌ విచారణకు హాజరైంది. ఇక సెప్టెంబర్‌ 6: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సెప్టెంబర్‌ 8: రాణా దగ్గుబాటి, సెప్టెంబర్‌ 9: రవితేజతోపాటు డ్రైవర్‌ శ్రీనివాస్‌, సెప్టెంబర్‌ 13: నవ్‌దీప్, ఎఫ్‌–క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌, సెప్టెంబర్‌ 15: ముమైత్‌ ఖాన్‌, సెప్టెంబర్‌ 17: తనీష్‌, సెప్టెంబర్‌ 20: నందు, సెప్టెంబర్‌ 22: తరుణ్‌ ఇలా ప్రత్యేకంగా అధికారులు విచారించనున్నారు.

అయితే విచారణ తేదీ మార్చాలని కోరుతూ ఈడీకి రకుల్ ప్రీత్ సింగ్ లేఖ రాసింది. అనివార్య కారణాల వల్ల విచారణకు హాజరు కాలేనంటూ ఈడీ అధికారులను రకుల్ కోరింది. తాను హాజరు అయ్యేందుకు మరో డేట్ ఇవ్వాలని అభ్యర్థించింది. అయితే రకుల్ రిక్వెస్ట్‌ను ఈడీ అధికారులు పట్టించుకోలేదు. ముందుగా నోటీసులు ఇచ్చిన ప్రకారం ఈ నెల 6న విచారణకు హాజరు కావాల్సిందేనని ఈడీ స్పష్టం చేసింది. గతంలో ఎక్సైజ్ అధికారులు విచారణ జరిపిన సమయంలో అందులో రకుల్ పేరు లేదు. తాజాగా ఈడీ అధికారుల లిస్ట్‌లో మాత్రం ఆమె పేరు వినిపిస్తోంది. కెల్విన్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌ లో చార్మి పేరు ఉండటంతో నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులు చార్మిని విచారిస్తున్నారు. కెల్విన్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌లో చార్మి పేరు దాదాగా సేవ్‌ చేసి ఉన్నట్టు తెలుస్తోంది. దాదా పేరుతో ఉన్న ట్రాన్జాక్షన్స్‌ని గుర్తించారు ఈడీ అధికారులు. కెల్విన్‌ ఇచ్చిన సమాచారంతోనే చార్మిని విచారిస్తున్నారు. ఈడీ అధికారులకు తన రెండు బ్యాంక్‌ అకౌంట్‌ నెంబర్లను ఇచ్చింది చార్మి. అయితే 2013 నుంచి 2018 వరకు మూడేళ్ల పాటు జరిగిన బ్యాంక్‌ లావాదేవీలను ఈడీ అధికారులకు సమర్పించింది చార్మి. ఆమెతో తన సీఏ సతీష్‌ ను వెంట పెట్టుకుని ఈడీ విచారణకు హాజరైంది చార్మి.

Next Story