సాయి పల్లవిపై ట్రోల్స్.. మండిపడ్డ తెలంగాణ గవర్నర్ తమిళిసై
Dr Tamilisai Soundarajan slams viral post on Sai Pallavi.నేచురల్ స్టార్ నటించిన చిత్రం శ్యామ్ సింగరాయ్. గతేడాది
By తోట వంశీ కుమార్ Published on 30 Jan 2022 8:47 AM ISTనేచురల్ స్టార్ నటించిన చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. గతేడాది డిసెంబర్ 24న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నెల(జనవరి) 21 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. కాగా.. ఈ చిత్రంలో సాయిపల్లవి దేవదాసి పాత్రలో నటించింది. అయితే.. సాయిపల్లవి అందంగా లేదంటూ ఓ తమిళ పత్రిక ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. ఓ నటిపై ఈ విధమైన బాడీ షేమింగ్ చేయడం పద్దతి కాదంటూ చాలా మంది దీనిని ఖండిస్తున్నారు.
ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై ట్విటర్ వేదికగా స్పందించారు. సాయి పల్లవిపై చేసిన వ్యాఖ్యలు బాధిస్తున్నాయన్నారు. ఓ తమిళ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమిళి సై మాట్లాడుతూ.. నటి సాయిపల్లవి గురించి బాడీ షేమింగ్ చేయడం తనను ఎంతగానో బాధించినట్లు చెప్పారు. ఇది చాలా తప్పుని.. గతంలో తన రూపాన్ని చూసి కూడా ట్రోల్ చేసేవారన్నారు. అలాంటి మాటలు పడ్డవారికే ఆ బాధంటే ఏమిటో తెలుస్తుందన్నారు. 'నా ప్రతిభతో, నా శ్రమతో ఆ మాటలను ఎదుర్కొన్నా. అలాంటి కామెంట్స్ బారిన పడకుండా ఉండటానికి మనమేమీ మహాత్ములం కాదు. అయితే.. నాపై చేసిన కామెంట్స్‌ను నేను పట్టించుకోలేదు. కానీ ఆ ట్రోలింగ్ వల్ల అవతలి వాళ్ళు కచ్చితంగా బాధపడతారు' అని చెప్పారు.
ఇక.. పొట్టిగా, నల్లగా, తన లాంటి(రింగుల) జుట్టుతో పుట్టడం తప్పేమీ కాదని.. వీటన్నింటిలోనూ అందం ఉందన్నారు. కాకి పిల్ల కాకికి ముద్దు అనే సామెత ఊరికే రాలేదన్నారు. కాకి తన పిల్లను నల్లగా ఉందని వదిలిపెట్టదని తెలిపారు. 'మహిళలు బాడీ షేమింగ్‌కు గురవుతారు కానీ పురుషులకు మాత్రం అలాంటి మాటలు ఎదురవవు. 50 ఏళ్ల వయసులో ఉన్న పురుషులను కూడా యువకులుగా చూస్తారు కానీ స్త్రీలను మాత్రం అలా చూడలేరు. స్త్రీల ఎదుగుదలకు ఇలాంటివన్నీ చూపించి మహిళలను బాధపెడుతూ వారి ఎదుగుదలను తగ్గించడానికి ప్రయత్నిస్తుంది ఈ సమాజం' అని తమిళిసై తీవ్రంగా స్పందించారు. మహిళలు అధైర్యపడకుండా తమతమ రంగాల్లో ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని గవర్నర్ సూచించారు.